అసోంలో మొదలైన పౌరసత్వ సెగ... ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగాల్, దిల్లీని తాకాయి. తాజాగా ఉత్తర్ప్రదేశ్లోనూ వందలాది మంది విద్యార్థులు నిరసనబాట పట్టారు. అలీగఢ్ ముస్లిం విశ్వ విద్యాలయం (ఏఎమ్యూ)కు చెందిన వందలాది మంది విద్యార్థులు ఆదివారం యూనివర్సిటీ ఆవరణలో నిరసన తెలిపారు.
లాఠీఛార్జీని వ్యతిరేకిస్తూ...
దిల్లీలోని జామియా విశ్వవిద్యాలయంలో పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. అదుపు చేయడానికి విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేసి, బాష్ప వాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
విద్యార్థులపై దిల్లీ పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఉత్తర్ప్రదేశ్ ఏఎమ్యూ విద్యార్థులు విశ్వవిద్యాలయ ఆవరణలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాళ్లు రువ్విన విద్యార్థులు...
పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీఛార్జి చేసి, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. విశ్వవిద్యాలయం అన్ని గేట్లకు తాళాలు వేశారు. ఘటనలో 60 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
పరిస్థితులను గమనించిన విశ్వవిద్యాలయం యాజమాన్యం రిజిస్టార్ అబ్దుల్ హమిద్.. 2020 జనవరి 5 వరకు విశ్వవిద్యాలయాన్ని మూసివేస్తున్నట్ల ప్రకటించారు. సంఘ విద్రోహ శక్తులు మూడు రోజుల నుంచి కళాశాలలో ఇబ్బందికర పరిస్థితులను సృష్టించడం వల్లే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
- ఇదీ చూడండి: లేబర్ పార్టీ అధ్యక్ష రేసులో భారత సంతతి మహిళ!