ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కుటుంబం రాసిన లేఖను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. గురువారం ఈ కేసుపై వాదనలు విననుంది. ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్ నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ ఈ నెల 12న సీజేఐకు లేఖ రాసింది ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కుటుంబం.
లేఖపై సీజేఐ ముందు ప్రస్తావించారు సీనియర్ న్యాయవాది వి.వి.గిరి. బాధిత కుటుంబం రాసిన లేఖను ఇంతవరకు తాను చూడలేదని సీజేఐ వ్యాఖ్యానించారు.
బాధితురాలి కుటుంబం రాసిన లేఖను ఎందుకు ఆలస్యంగా తీసుకువచ్చారని సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శిని సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి ప్రశ్నించారు. ఆలస్యానికి కారణాలపై వారంలోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
ప్రమాదంలో గాయపడిన బాధితురాలి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది.
రోడ్డు ప్రమాదంపై అనుమానాలు
అత్యాచార కేసు బాధితురాలికి జులై 28న రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌బరేలీలో జరిగిన ఈ ప్రమాదంలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనలో కుట్ర కోణం దాగి ఉందన్న ప్రతిపక్షాల ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టాలని కేంద్రం సీబీఐని ఆదేశించింది.
కుల్దీప్ సెన్గర్పై సీబీఐ కేసు నమోదు
ఎమ్మెల్యే కుల్దీప్ సెన్‌గర్ సహా మరో 10 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. జులై 28న అత్యాచార బాధితురాలికి జరిగిన ప్రమాదంలో సెన్‌గర్ హస్తం ఉందని ఆరోపణలు తలెత్తుతున్న నేపథ్యంలో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
ప్రమాదం జరిగిన గురుబక్ష్‌గంజ్ పోలీసుల నుంచి సీబీఐ వర్గాలు సమాచారాన్ని సేకరించనున్నాయి.
యూపీ ప్రభుత్వంపై విమర్శలు
బాధితురాలికి భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దద్దరిల్లిన లోక్‌సభ
ఉన్నావ్ బాధితురాలికి ప్రమాదం జరగడంపై ప్రభుత్వం సమాధానమివ్వాలని లోక్‌సభలో విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశాయి.
ఇదీ చూడండి: 'ఫేక్' ఉచ్చులో పడ్డ జనం- 'ఫ్రీ మనీ' కోసం క్యూ