బిహార్ శాసనసభ ఎన్నికల్లో లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. 'బిహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్' అనే నినాదంతో ముందుకు వెళ్తున్న తమను ప్రజలు ఆశీర్వదించాలని.. ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ కోరారు. శనివారం ఇందుకు సంబంధించి ఓ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. తద్వారా.. తాము ఎన్డిఏ కూటమితో భాగం పంచుకోవట్లేదనే సంకేతాలిచ్చారు.
'జేడీయూకు మాత్రమే..'
నరేంద్ర మోదీ నాయకత్వానికి తమ పార్టీ మద్దతు తెలుపుతోందని అన్నారు చిరాగ్ పాసవాన్. కానీ, జేడీయూకి మాత్రమే తాము వ్యతిరేకం అని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు తన భుజంపై మోదీ చేయి వేసిన చిత్రాన్ని పంచుకున్నారు.
"మేము బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్‌కు మాత్రమే వ్యతిరేకం. 'బిహార్ ఫస్ట్ బిహారీ ఫస్ట్' విజన్‌ను మోదీ స్ఫూర్తితో తీసుకువచ్చాం. ఇది నా ఒక్కడి ఆశనే కాదు. బిహారీలందరి చిరకాల స్వప్నం. మా పార్టీ అభ్యర్థులందరూ.. మోదీ నాయకత్వానికి బలం అందిస్తారు. "
-- చిరాగ్ పాసవాన్, ఎల్జేపీ అధ్యక్షుడు.
మొత్తం 243 స్థానాలకు.. ఎల్జేపీ 143 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. భాజపా అభ్యర్థుల స్థానాల్లో తాము పోటీ చేయట్లేదని ఎల్జేపీ వర్గాలు తెలిపాయి. కానీ, జేడీయూతో, భాజపా సీట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నందున... ఎల్జేపీ అసంతృప్తితో ఉందని సమాచారం. ఈ పరిస్థితుల్లో భాజపా, ఎల్జేపీల కలయిక సాధ్యపడకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2015లో ఎల్జేపీ 42 స్థానాల్లో పోటీ చేయగా రెండు చోట్ల విజయం సాధించింది.
ఇదీ చూడండి:- బిహార్ బరి: ఎన్డీఏను వీడితే ఎల్జేపీకి కష్టమేనా?