చైనా ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని భారత సైన్యం సోమవారం ఉదయం లద్దాఖ్‌లో దెమ్‌చోక్ వద్ద అదుపులోకి తీసుకుంది. అతని వద్ద నుంచి పౌర, సైన్యానికి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రాథమికంగా వస్తున్న సమాచారం ప్రకారం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)లో కార్పరల్ స్థాయి సైనికుడిగా అతడిని గుర్తించారు. జహిజాంగ్ ప్రావిన్స్‌లోని షాన్‌జిగ్జ్‌హెన్ పట్టణానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.
అతడు చైనా సైన్యంలో తుపాకీలను మరమ్మతు చేసేవాడని తెలిసింది. గూఢచారిగా భారత్‌కు వచ్చాడా? లేక మరేదైనా ప్రణాళిక ఉందా? అతనితో పాటు ఎవరెవరు భారత్‌లో ఉంటున్నారు? ఇక్కడ అతడు ఎవరెవరితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు? తదితర విషయాలపై భారత సైన్యం విచారణ చేపట్టింది. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ప్రొటోకాల్ ప్రకారం అతడిని చైనాకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
సైన్యం ధ్రువీకరణ..
పీఎల్‌ఏకు చెందిన వాంగ్ యా లాంగ్ అనే కార్పరల్ స్థాయి సైనికుడిని లద్ధాఖ్‌లో గుర్తించినట్లు భారత సైన్యం ధ్రువీకరించింది. ఎత్తైన ప్రాంతంలోని కఠిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అతడికి అవసరమైన వైద్య సాయం, ఆహారం, వెచ్చని దుస్తులు అందించినట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం వాంగ్‌ను తిరిగి ఛుషుల్ మోల్డో మీటింగ్ పాయింట్ వద్ద చైనాకు అప్పగించనున్నట్లు వివరించింది.