జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ నాయకుడు మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలనే అంశం త్వరలోనే పరిష్కారమవుతుందని చైనా రాయబారి లూవో ఝెహూయి పేర్కొన్నారు. ప్రస్తుత చైనా నిలుపుదల నిర్ణయం సాంకేతిక కారణాల వల్లేనని, పరిష్కారానికి మరిన్ని చర్చలు అవరమని స్పష్టం చేశారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 1267 ఆంక్షల జాబితాలో అజార్ పేరును చేర్చాలన్న ప్రతిపాదనకు చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దిల్లీలోని చైనా దౌత్య కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు చైనా రాయబారి లూవో. ఈ సందర్భంగా మసూద్ సమస్యపై పలు వ్యాఖ్యలు చేశారు.
"మసూద్ కేసుపై భారత ఆందోళనను పూర్తిగా అర్థం చేసుకున్నాం, నమ్ముతున్నాం. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని నమ్ముతున్నా. ఇది కేవలం సాంకేతిక నిలుపుదలే. దాని అర్థం నిరంతర సంప్రదింపులు అవసరం. ఈ సమస్య పరిష్కారమవుతుంది నన్ను నమ్మండి" - లువో ఝోహూయి, భారత్‌లో చైనా రాయబారి.
గత ఏడాది వూహన్ సదస్సు తరువాత ఇరుదేశాల మధ్య సహకారం సరైన మార్గంలోకి వచ్చిందని తెలిపారు లూవో. భారత సహకారంపై సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సైతం ఇలాగే కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.