భారత ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగంపై పాకిస్థాన్ అక్కసును వెళ్లగక్కింది. ఇది ఐరాస నిబంధనలను ఉల్లంఘించడమేనని, అంతరిక్షంలో ఆయుధ పోటీకి దారితీస్తుందని వ్యాఖ్యానించింది. చైనా మాత్రం ఆచితూచి స్పందించింది.
భారత్ చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. భూ దిగువ కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని 'భారత రక్షణ పరిశోధన- అభివృద్ధి సంస్థ' శాస్త్రవేత్తలు ఏ-శాట్ క్షిపణి ద్వారా కూల్చగలిగారు. ఫలితంగా రోదసీలో తిరుగులేని శక్తులుగా ఉన్న అమెరికా, రష్యా, చైనాల సరసన నిలిచింది భారత్.
పాక్ అక్కసు
ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం చేసి భారత్ ఐరాస నిబంధనలను ఉల్లంఘించిదని పాక్ ఆరోపించింది. భారత్ చర్య అంతరిక్షంలో ఆయుధ పోటీకి దారితీస్తుందని వ్యాఖ్యానించింది. భారత్ ఊహాజనిత శత్రువుపై యుద్ధం చేస్తున్నట్లు ఉందంటూ మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది.
"అంతరిక్షం మానవాళి ఉమ్మడి వారసత్వ సంపద. రోదసీ రంగంలో సైనికీకరణకు దారితీసే చర్యలను నివారించాల్సిన బాధ్యత ప్రతిదేశంపైనా ఉంది."- మహమ్మద్ ఫైసల్, పాక్ విదేశీ కార్యాలయ అధికార ప్రతినిధి
ఆచితూచి స్పందించిన చైనా
ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం నిర్వహించడంపై చైనా ఆచితూచి స్పందించింది. అంతరిక్ష రంగంలో ఎలాంటి సంక్షోభం తలెత్తకుండా అన్ని దేశాలు శాంతికి కృషి చేస్తాయని ఆశిస్తున్నట్లు ప్రకటించింది.
"భారత్ చేపట్టిన ప్రయోగ నివేదికలను గమనించాం. అంతరిక్షంలో శాంతి కొనసాగడానికి అన్ని దేశాలు కృషి చేస్తాయని ఆశిస్తున్నాం."
- చైనా విదేశాంగశాఖ మంత్రి
భారత్ఇప్పుడు చేపట్టిన ప్రయోగం వంటిదే, చైనా 2007లో నిర్వహించింది. ఉపగ్రహ విధ్వంసక క్షిపణితో తన వాతావరణ ఉపగ్రహాన్నే కూల్చివేసింది.
శాంతికి కట్టుబడి ఉంటాం...
'మిషన్ శక్తి' విజయవంతం కావడంపై ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రయోగం ఏ దేశానికీ వ్యతిరేకంగా చేసినది కాదని స్పష్టం చేశారు. భారత్ అంతర్జాతీయ న్యాయసూత్రాలకు కట్టుబడి ఉంటుందన్నారు.
దేశ భద్రత కోసమే ఈ ప్రయోగం చేశామని, అంతరిక్ష రంగంలో ఆయుధపోటీలో నిలవాలనే ఆలోచన లేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.
ఇదీ చూడండి :బాక్స్ మార్చకుండానే టీవీ నెట్వర్క్ మార్చొచ్చు!