విస్తరణకాంక్షతో భారత్ సరిహద్దులో ఉద్రిక్తతలు రాజేసిన డ్రాగన్ దేశం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఇంత కాలం గల్వాన్ లోయలో తిష్ఠ వేసిన తన సైన్యంలోని కొంత భాగాన్ని అక్కడి నుంచి ఉపసంహరించింది.
సైన్యంతో పాటు సైనిక వాహనాలను గల్వాన్లోని లోతైన ప్రాంతానికి తరలించినట్లు భారత అధికారులు తెలిపారు. జూన్ 22న భారత అధికారులతో జరిగిన సమావేశంలో ఒప్పందం చేసుకున్న ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
"తన బలగాలను గల్వాన్ లోయలోని లోతైన ప్రదేశానికి తరలిస్తామని జూన్ 22న చైనా హామీ ఇచ్చింది. దీని ప్రకారం కొంతమంది సైనికులు, వాహనాలను గల్వాన్ ప్రాంతం నుంచి ఉపసంహరించింది."
-అధికార వర్గాలు
జూన్ 15న జరిగిన హింసాత్మక ఘర్షణలను పునరావృతం చేయకుండా రెండు పక్షాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. జూన్ 22న భారత ఆర్మీ 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా సైనిక అధికారి మధ్య మోల్డోలో జరిగిన సమావేశంలో బలగాల ఉపసంహరణకు పరస్పరం అంగీకారానికి వచ్చారు.
హింసాత్మకం
జూన్ 15న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. మరో 10 మందిని చైనా సైనికులు బంధించి తర్వాత విడుదల చేశారు. హింసాత్మక ఘటనలో మరణించిన, గాయపడ్డ చైనా సైనికులు 43 మంది వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి