భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కొన్ని ప్రాంతాల నుంచి చైనా బలగాలు వెనక్కి మళ్లినప్పటికీ భారత్ అప్రమత్తతను కొనసాగిస్తోంది. సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా పొరుగుదేశ బలగాలు, సాయుధ వాహనాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైమానికదళం సైతం గస్తీని చేపడుతోంది. గస్తీ హెలికాప్టర్లు, యుద్ధవిమానాలు చైనా సరిహద్దుకు సమీపంలోని ఎయిర్‌బేస్‌ల నుంచి గస్తీ నిర్వహిస్తున్నాయి.
"ఆకస్మిక దాడులను ఎదుర్కొనేందుకే రాత్రివేళ గస్తీని చేపడుతున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఆధునిక సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించగలిగే సుశిక్షితులు, అంకిత భావం ఉన్న ఉద్యోగులను వైమానిక దళం కలిగి ఉంది. సరిహద్దులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం."
- ఏ. రత్తి, సీనియర్ యుద్ధ విమాన పైలట్
వైమానిక దళానికి చెందిన అపాచీ, చినూక్ పోరాట హెలికాప్టర్లు, మిగ్- 17, మిగ్- 29, ఏఎన్-23 యుద్ధ విమానాలు కశ్మీర్, ఉత్తరాఖండ్‌ల్లోని ఎయిర్ బేస్‌ల నుంచి రాత్రివేళ సైతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. చైనా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా రాత్రి వేళ కూడా తిప్పికొట్టేందుకే ఈ సన్నాహాలు చేపట్టినట్లు సమాచారం.
ఇదీ చూడండి: బడిలో పంట పండించి.. వలసలు ఆపిన మాస్టారు!