భారత భూభాగాన్ని చైనాకు ప్రధాని మోదీ అప్పగించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. గల్వాన్ లోయ ఘర్షణలను రక్షణ శాఖ వైఫల్యంగా ముద్ర వేయలేమని పవార్ అభిప్రాయపడ్డారు.
"ఈ విషయం అత్యంత సున్నితమైనది. సరిహద్దుల్లో చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. భారత్ సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం చేపడుతోంది. దీన్ని అడ్డుకోవడానికి చైనా భౌతికంగా ప్రయత్నించింది. మనం గస్తీ నిర్వహిస్తున్నప్పుడు ఎవరైనా ఎలాగైనా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో దిల్లీలో ఉన్న రక్షణ మంత్రి వైఫల్యంగా పరిగణించలేం."
- శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
అందుకే ఘర్షణలు..
ఆ ప్రాంతాల్లో గస్తీ కొనసాగుతోందని, సైనికులు అప్రమత్తంగా ఉన్నందువల్లనే ఘర్షణ చెలరేగిందని శరద్ పవార్ వివరించారు. అక్కడి పరిస్థితుల ప్రకారం ఎవరైనా చైనా బలగాలు వస్తాయని ఊహించలేరని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఆరోపణలు చేయటం అర్థరహితమని అన్నారు.
ఆ విషయం మరిచిపోతే ఎలా?
ముఖ్యంగా రాహుల్ చేస్తోన్న ఆరోపణలపై స్పందించిన శరద్ పవార్.. గతాన్ని మరిచిపోవద్దని వ్యాఖ్యానించారు.
"1962 యుద్ధం తర్వాత భారత భూభాగంలో 45 వేల చ.కి.మీ ఆక్రమించిన విషయం మర్చిపోకూడదు. ఇప్పటికీ ఆ భూభాగం చైనా అధీనంలోనే ఉంది. ఇప్పుడు ఆక్రమించిన విషయంపై నాకు స్పష్టత లేదు. నేను ఆరోపణలు చేసేముందు.. నేను అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో కూడా చూడాలి. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. దీన్ని రాజకీయం చేయటం తగదు."
- శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
ఇదీ చూడండి: భాజపా X కాంగ్రెస్: వైఫల్యమా? పైశాచికత్వమా?