సాధారణంగా పొరుగు దేశాలకు ఏమైనా ఆపద వస్తే ఆపన్నహస్తం అందించడంలో భారత్ ముందుంటుంది. ఇటీవల కొవిడ్-19 (కరోనా) మహమ్మారి ధాటికి అల్లాడిపోతున్న చైనాకు సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది.
కరోనాపై పోరాడేందుకు తమ వంతు సాయం అందిస్తామని, ఇందులో భాగంగా వైద్య సామగ్రితో ఉన్న ఓ సహాయక విమానాన్ని వుహాన్ నగరానికి పంపుతామని భారత ప్రభుత్వం ఇటీవల ఓ ప్రకటన చేసింది. తిరుగు ప్రయాణంలో వుహాన్‌లో ఉండిపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావాలని యోచించింది. అనుకున్నట్లుగానే అంతా సిద్ధం చేసింది.
ఫిబ్రవరి 20న ఈ సహాయక విమానం దిల్లీ నుంచి వుహాన్ బయల్దేరాల్సి ఉంది. అయితే ఇందుకు చైనా ఇంకా అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం.
విమానానికి క్లియరెన్స్ ఇవ్వడంలో పొరుగు దేశం కావాలనే ఆలస్యం చేస్తోందని భారత ఉన్నత స్థాయి అధికార వర్గాలు ఆరోపిస్తున్నాయి.
అబ్బే అలాంటిదేం లేదు: చైనా
అయితే చైనా మాత్రం భారత్ ఆరోపణలను ఖండించింది.
"హుబేలో ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. కొవిడ్-19 నివారణ, కట్టడి చర్యలు కీలక దశలో ఉన్నాయి. భారత విమానాన్ని అనుమతించడంలో ఎలాంటి ఉద్దేశపూర్వక ఆలస్యం లేదు."
- దిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి