తమిళనాడు రామనాథపురానికి చెందిన సుభాష్ శ్రీనివాసన్‌కు చెట్లపై ఎనలేని ప్రేమ. అందుకే వాటికి గుచ్చుకున్న అనవసరమైన మేకులను పెకిలించడమే ఆయన పనిగా పెట్టుకున్నారు.
ఆయువు పెంచే దిశగా..
చెట్లకు ఇనుప మేకులు కొట్టడంవల్ల వాటి ఆయుష్షు నానాటికీ తగ్గిపోతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఈ విషయం తెలిసిన సుభాష్... దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రెండేళ్లుగా తూఛ తప్పకుండా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు.
ఓ ఉద్యోగ శిక్షణా కేంద్రంలో చీఫ్ గార్డ్‌గా పనిచేస్తున్నప్పటికీ.. చెట్లకు సేవ చేసేందుకు రోజూ ఉదయం ఓ గంట, సాయంత్రం ఓ గంట సమయాన్ని కేటాయించారు సుభాష్. మేకులు పెకిలే సుత్తి, ఓ ఇనుప రాడ్, నిచ్చెన వంటి సామగ్రితో తన మనుమడిని వెంటబెట్టుకుని బయల్దేరుతారు. చెట్టుకు మేకులు కనిపించిన చోట వాహనం ఆపేసి ఇలా తొలగించేస్తారు.
"చెట్ల నుంచి మేకులు తీయడం నాకు సరదాగా ఉంటుంది. ఒక్క చెట్టులో దాదాపు 50 మేకులున్నాయి. ఇప్పటివరకు నేను 23 కిలోల ఇనుప మేకులను తొలగించాను. ఇప్పుడు నీటిని కొనుక్కున్నట్లు భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొనవచ్చు. అందుకే మనం ఎక్కువ చెట్లు నాటాలి. భవిష్యత్తును కాపాడుకోవాలి. "
- సుభాష్ శ్రీనివాసన్
ఇదీ చూడండి:కార్గిల్ వీరవనిత 'గుంజన్ సక్సేనా'గా జాన్వీ