మాజీ కేంద్రమంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారించి, ఆదేశాలు ఇచ్చే వరకు... ఆయనపై బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని అతని తరపు న్యాయవాదుల బృందం సీబీఐని కోరింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను నిన్న దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ, ఈడీ అధికారులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. రెండుసార్లు చిదంబరం ఇంటికెళ్లినా ఆయన లేకపోవడం వల్ల వెనుదిరిగారు. రాత్రి సమయంలో ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. వెంటనే తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
సుప్రీంలో బెయిల్ పిటిషన్
సీబీఐ, ఈడీలు తనను అరెస్టు చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు సుప్రీంకోర్టు ఈ బెయిల్ పిటిషన్ను విచారించనుంది. చిదంబరం తరపున సీనియర్ న్యాయవాది, పార్టీ సహచరుడు కపిల్ సిబల్ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం వాదనలు వినిపించనుంది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసు
2007లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో... ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపునకు రూ.305 కోట్ల విదేశీ నిధులు అందాయి. అయితే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్టు (ఎఫ్ఐపీబీ) క్లియరెన్స్ విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా సీబీఐ 2017 మే 15న ఐఎన్ఎక్స్ మీడియాపై కేసు నమోదు చేసింది. ఆ తరువాత ఇదే మీడియా గ్రూపుపై 2018లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేసింది.
ఇదీ చూడండి: గుండెపోటుతో మధ్యప్రదేశ్ మాజీ సీఎం బాబూలాల్ మృతి