బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే 'ఛఠ్ పూజ' ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా కార్తీక మాసం శుక్ల పక్షంలోని శష్ఠి సందర్భంగా నాలుగు రోజుల పాటు ఈ ఛఠ్ పూజలు నిర్వహిస్తారు. దీపావళి తర్వాత జరిగే అతిపెద్ద హిందూ పండుగ కూడా ఇదే. దీపావళి మాదిరిగానే దీపాలు పెట్టి దైవాన్ని పూజిస్తారు. ఈ ఛఠ్ పూజను.. సూర్య సస్థిల్ పూజ, దలా ఛఠ్ అని కూడా పిలుస్తారు.
పూజారి లేని అరుదైన హిందూ పండుగ..
ఈ ఏడాది ఛఠ్ పూజ నవంబర్ 18 (బుధవారం)తో ప్రారంభమై నవంబర్ 21 (ఆదివారం)తో ముగుస్తుంది. నవంబర్ 20న సాయంత్రం సూర్యుడికి తొలి పూజ నిర్వహిస్తారు. నవంబర్ 21న ఉదయం.. ఉదయించే సూర్యుడికి పూజలు చేసి..ఛఠ్ పూజకు ముగింపు పలుకుతారు. పూజారి పాల్గొనని అత్యంత అరుదైన హిందూ పండుగగా ప్రాచుర్యం పొందింది.
36 గంటల పాటు ఉపవాసం..
ఛఠ్ పూజ ప్రారంభం మొదటి రోజును నహయ్-ఖాయ్గా పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా 36 గంటల పాటు మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తారు అక్కడి ప్రజలు. సూర్య భగవానుడిని కొలుచుకునే ఏకైక పూజగా అక్కడివారు విశ్వసిస్తారు.
ఛఠ్ మాతాను పూజించేందుకు ఠెకువా, పువా వంటి ప్రసాదాలను ఎంతో పవిత్రంగా తయారు చేసి నివేదిస్తారు. బిహార్లో దివాళీతో పాటే ఈ ఉత్సవాల ప్రసాదాలను తయారు చేయటం ప్రారంభిస్తారు. ఛఠ్ మహాపర్వకు వివిధ రకాల పండ్లను వినియోగిస్తారు. నదీ ఘాట్ల వద్ద పండ్లతో అలంకరించి ఛఠ్ మాతను పూజిస్తారు. అనంతరం ఆ పండ్లను పంచిపెడతారు. ఈ పూజలోని ప్రసాదాల్లో చెరుకు ప్రధానంగా కనిపిస్తుంది. మహాపర్వ సందర్భంగా చెరుకు గడెలతో ఇళ్లులా నిర్మించి అందులో ఏనుగు ప్రతిమను ఉంచి పూజలు చేస్తారు.
ఇదీ చూడండి: ఆ ఊరి నిండా అల్లుళ్లే.. కారణమిదే.?