కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి నేఫథ్యంలో దిల్లీ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. బ్రిటన్ నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికులు.. విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. 8 గంటలు గడిచినా.. కొవిడ్ పరీక్షా ఫలితాల నివేదికలు అందకపోవడం వల్ల వారంతా అక్కడే నిరీక్షిస్తూ ఉండిపోయారు.
తాజా నిబంధనల ప్రకారం బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులు.. తప్పనిసరిగా కొవిడ్ పరీక్షా పత్రాన్ని చూపించాలి. అప్పుడే.. వారికి విమానాశ్రయం నుంచి బయటకు అనుమతి ఉంటుంది. అయితే.. గతరాత్రి దాదాపు 500 మంది ప్రయాణికులు బ్రిటన్ నుంచి దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే వారందరికీ పరీక్షలు నిర్వహించేలా అధికారులు ఏర్పాటు చేశారు. కానీ, పరీక్ష ఫలితాలు రావడంలో ఆలస్యమవడం వల్ల వారంతా అక్కడే చిక్కుకుపోయారు.
కొత్త రకం కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్ నుంచి వచ్చే విమాన సర్వీసులను డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తూ గత అర్ధరాత్రి కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా.. డిసెంబర్ 21 నుంచి డిసెంబర్23 మధ్య భారత్కు వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది.
ఇదీ చూడండి:బ్రిటన్ ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు