చంద్రయాన్-1కు కొనసాగింపుగా చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టింది ఇస్రో. తొలి ప్రాజెక్టు సాధించని ఎన్నో ఘనతల్ని... దీని ద్వారా సాధ్యం చేయాలనుకుంటోంది. నీటి జాడపై పూర్తి సమాచారం, జాబిల్లి పుట్టుక, ఆవాసానికి వీలుందా వంటి అంశాలపై లోతుగా విశ్లేషణ చేయనుంది.
చంద్రయాన్-2 మాడ్యూల్లో మూడు భాగాలుంటాయి. అవి... ఆర్బిటర్, విక్రమ్(ల్యాండర్), ప్రగ్యాన్(రోవర్).
ఆర్బిటర్ చంద్రుని చుట్టు తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. విక్రమ్ పేరుతో పిలిచే ల్యాండర్ చంద్రునిపై దిగుతుంది. ల్యాండర్‌లో ఉండే రోవర్ ప్రగ్యాన్... జాబిల్లి ఉపరితలంపై నీటి ఆనవాళ్లపై పరిశోధన చేస్తుంది.
చంద్రయాన్-2 ఎలా పనిచేస్తుంది...?
శ్రీహరికోట నుంచి నింగికెగసిన జీఎస్ఎల్వీ మార్క్-3ఎం1 వాహననౌక 3.8 టన్నుల బరువుగల చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
చంద్రయాన్-2 మాడ్యూల్లో ఉంచిన చిన్నచిన్న రాకెట్ల ద్వారా దాని కక్ష్యను దశలవారీగా పెంచుతారు. ఇలా 16 రోజుల పాటు వ్యోమనౌక భూమి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కక్ష్యలో నిర్దేశిత ఎత్తుకు చేరాక ఈ వ్యోమనౌక భూకక్ష్య నుంచి మెల్లగా చంద్రుడి దిశగా మళ్లుతుంది. ఇందుకు సుమారు 5 రోజులు పడుతుంది. మరోసారి రాకెట్‌ను మండించి.. దాన్ని చంద్రుడి కక్ష్యలోకి చేరుస్తారు. అప్పటికి ఇది భూమి నుంచి బయల్దేరి 20-21 రోజులవుతుంది.
తర్వాత అక్కడి నుంచి కక్ష్యలో క్రమంగా కిందకు దిగుతూ నెమ్మదిగా చందమామ ఉపరితలానికి 100 కిలోమీటర్ల ఎత్తులో నిలకడగా తిరగటం ప్రారంభిస్తుంది. ఈ స్థితికి చేరుకోవడానికి మరో 27 రోజులు పడుతుంది. దీంతో ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయే ఘట్టానికి రంగం సిద్ధం అయినట్లే. కక్ష్యలో స్థిరంగా తిరుగుతున్న ఈ దశలో.. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయేలా ఇస్రో ఆదేశాలు పంపుతుంది. ల్యాండర్ చంద్రుడికి మరింత దగ్గరగా ప్రయాణం మొదలు పెడుతుంది. ఆర్బిటర్ మాత్రం వంద కిలోమీటర్ల ఎత్తులో అలా చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మెల్లగా ల్యాండర్ చంద్రుడి వైపు పయనించటం మొదలుపెడుతుంది.
కీలక దశ...
మాడ్యూల్ చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నాక... ఈ ప్రయోగం మొత్తంలోనే కీలక దశ ఆరంభమవుతుంది. ఈ దశలో వేగాన్ని తగ్గించే రాకెట్లు మండుతాయి. చంద్రుడిపై వాతావరణం ఉండదు కాబట్టి.. కక్ష్య నుంచి శరవేగంతో దూసుకొచ్చే ల్యాండర్‌ను ఆపటానికి పారాషూట్లు ఉపయోగపడవు. అందుకే ఈ ప్రత్యేక రాకెట్లు. ఈ దశలో ల్యాండర్ తనంతట తానుగా నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెడుతుంది. ఉపరితలానికి చేరువయ్యాక... వేగాన్ని గంటకు 3.6 కిలోమీటర్ల కన్నా తక్కువకు తగ్గించుకుంటుంది. కొంతసేపు నిశ్చల స్థితిలో ఉంటూ అక్కడి నేలను స్కాన్ చేయటం మొదలు పెడుతుంది. ఎక్కడ దిగితే మంచిదో అన్వేషణ ఆరంభిస్తుంది. కెమెరాల సాయంతో కింద రాళ్లు రప్పల్లాంటి అవరోధాలేమీ లేకుండా, సూర్యకాంతి బాగుండే ప్రాంతాన్ని చూసుకుని దిగుతుంది.
డబుల్ రోల్...
ల్యాండర్ క్షేమంగా చంద్రుడిపై కాలు మోపిన తర్వాత.. రోవర్ పని మొదలవుతుంది.
ల్యాండర్ నుంచి జారుడు బల్ల లాంటి ఒక ర్యాంప్ తెరుచుకుంటుంది. అందులో నుంచి 6 చక్రాల రోవర్ మెల్లగా కిందకు దిగుతుంది. అలా వస్తున్నప్పుడే దాని సౌర ఫలకం విచ్చుకుంటుంది. చంద్రుడిపై దిగనున్న రోవర్.. సెకనుకు సెంటీమీటరు వేగంతో 14 రోజుల పాటు పయనిస్తూ సమాచారాన్ని సేకరించనుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి.. ఆ సమాచారాన్ని, చిత్రాలను పంపించనుంది. చంద్రుడిపై నీరు, ఖనిజాల గురించి పరిశోధనలు చేస్తుంది.
చిన్నగా... చురుకుగా...
చంద్రుడిపై తిరిగే ప్రగ్యాన్ రోవర్.. కొంత ఇస్రో పంపే ఆదేశాలకు అనుగుణంగా, కొంత సొంత మేథస్సుతో పనిచేస్తుంది. ఇది బ్రీఫ్ కేస్ అంతే ఉంటుంది. చంద్రుడి నేలను దగ్గరగా పరిశీలించి, ఆ డేటా భూమికి పంపుతుంది.
కదలిక కోసం రోవర్లో అల్యూమినియంతో తయారైన 6 ప్రత్యేక చక్రాలు అమర్చారు. ఏ దారిలో వెళ్లాలో తేల్చుకునేందుకు నేవిగేషన్ కెమెరా, ఇన్‌క్లైనోమీటర్ ఉన్నాయి. చంద్రుడి నేలలో కూరుకుపోకుండా నడిచేలా చక్రాలను విడివిడి మోటార్లతో రూపొందించారు. ఈ రోవర్ సెకనుకు 1-2 సెంటీమీటర్ల దూరమే ప్రయాణిస్తుంది. ఉపరితలాన్ని శోధించి, అక్కడ నీరు, ఇతర రసాయనాలను గుర్తించడంలో సాయపడుతుంది. ఇది 15 రకాల పరీక్షలు అక్కడికక్కడే చేస్తుంది.
ఇలా 3 విభిన్న దిశల్లో వేర్వేరు పనులు చేస్తుండే మూడింటినీ కలిపి ఏకకాలంలో ఒక వ్యోమనౌక ద్వారా ప్రయోగించడం వల్లే అత్యంత క్లిష్టంగా మారింది చంద్రయాన్-2.
అతి తక్కువ ఖర్చుతో...
చంద్రయాన్-1 వ్యయం రూ. 386 కోట్లు.. చంద్రయాన్-2 కోసం రూ. 978 కోట్లు వెచ్చించింది ఇస్రో. చంద్రయాన్-1 బరువు.. 1.38 టన్నులు. ఇప్పటి మిషన్ బరువు 3.8 టన్నులు.
''భారత్ ప్రయోగించే చంద్రయాన్-2 ఖర్చు మొత్తం 150 మిలియన్ డాలర్లు. మీరు గమనిస్తే... నాసా చివరిసారిగా చంద్రునిపైకి పంపిన మిషన్ ఖర్చు దీని కంటే 10 రెట్లు ఎక్కువే. అత్యంత తక్కువ వ్యయంతో, ప్రభావవంతమైన యంత్రాలతో ప్రయోగాలు చేయడం భారత్‌కు తెలుసు. భారత ఇంజినీర్లు, భారత శాస్త్రవేత్తలు, ఇస్రో సామర్థ్యంతోనే ఇది సాధ్యమైంది.''
- పల్లవ బగ్లా, విజ్ఞాన శాస్త్ర నిపుణుడు