భారత్ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ -2.. చంద్రుని కక్ష్యలో చేరి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చంద్రయాన్- 2లో అన్ని యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నట్లు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది. మరో ఏడేళ్లు నిర్విరామంగా పనిచేసేందుకు ఆర్బిటార్‌లో తగినంత ఆన్‌బోర్డ్ ఇంధనం ఉందని స్పష్టం చేసింది.
గతేడాది జులై 22న చంద్రయాన్-2 ను ఇస్రో ప్రయోగించగా ఆగస్టు 20న చంద్రుని కక్ష్యలో చేరింది. చంద్రునిపై రోవర్‌ను దింపేందుకు భారత్ చేసిన తొలి ప్రయోగం ఇదే. అయితే చంద్రుని ఉపరితలంపై విక్రమ్ (ల్యాండర్) సాఫ్ట్ ల్యాండింగ్ విఫలమైనా ఆర్బిటార్ మాత్రం జాబిల్లి కక్ష్యలో విజయవంతంగా పనిచేస్తోంది. ఇప్పటివరకు మొత్తం 4,400 సార్లు చంద్రుని చుట్టూ తిరిగింది.
డేటా సేకరణ..
చంద్రుని ఉపరితలంపై పరిశోధన, ఖనిజాలు, నీటి జాడ కోసం చంద్రయాన్- 2ను ప్రయోగించింది ఇస్రో. ఇందుకోసం రోవర్‌తో పాటు ఆర్బిటార్‌లో 8 పేలోడ్లు, కెమెరాలను అమర్చింది.
ఇప్పటివరకు ఆర్బిటార్ పంపిస్తోన్న డేటాను భారత అంతరిక్ష శాస్త్రీయ సమాచార కేంద్రం (ఐఎస్ఎస్డీసీ)లో నిక్షిప్తం చేస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఆర్బిటార్ పంపిన సమాచారాన్ని ఈ ఏడాది చివరికల్లా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇస్రో స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: చంద్రయాన్-2: '500మీ. దూరంలో అలా జరిగిపోయింది'