భూగర్భ జలాల దుర్వినియోగాన్ని, వృథాను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర భూగర్భ జల మండలి(సీజీడబ్ల్యూబీ) కోరింది. ఉల్లంఘనలకు పాల్పడే వారిపై పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం అయిదేళ్ల వరకూ జైలు, రూ.లక్ష వరకూ జరిమానా విధించటం వంటి నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నీటి సరఫరా వ్యవస్థలకు సీజీడబ్ల్యూబీ ఈ సూచనలు పంపించింది.
భూగర్భ జలాల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు సమర్థవంతంగా లేవని ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను ఆక్షేపించింది. పర్యావరణ చట్ట నిబంధనల అమలుకు కాలవ్యవధిని నిర్ణయించటంతో పాటు పర్యవేక్షణా పకడ్బందీగా ఉండాలని తెలిపింది.
ఇదీ చూడండి:'నా వ్యాఖ్యల్ని భాజపా వక్రీకరించింది'