పౌరసత్వ చట్ట సవరణను దేశంలోని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బంగాల్లో పౌర నిరసనలు విస్తృతంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ఆందోళనలు నిర్వహించి.. కేంద్రానికి గట్టి సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో పౌరసత్వాన్ని అందించే ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించాలన్న కేంద్రం ప్రణాళికను తృణముల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆన్లైన్ ప్రక్రియను అమలు చేస్తే కేంద్రం కచ్చితంగా విఫలమవుతుందని ఆ పార్టీ ఎంపీ సుదీప్ బందోపధ్యాయ్ పేర్కొన్నారు.
"కేంద్రం ఏదైనా చెప్పగలదు. కానీ వాస్తవాన్ని అర్థంచేసుకోవాలి. భారత్లో పౌరసత్వాన్ని ఆన్లైన్ ద్వారా అందించడం, నమోదు చేసుకోవడం వంటివి పూర్తిగా విఫలమవుతాయి. ఈ ఆలోచన వాస్తవానికి ఎంతో దూరంలో ఉంది."
--- సుదీప్ బందోపధ్యాయ్, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ.
సహజంగా జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఈ పౌరసత్వ ప్రక్రియ జరుగుతుంది. పౌర నిరసనల కారణంగా ఈ విధానాన్ని నిలిపివేయాలని కేంద్రం యోచిస్తోంది.
ఆన్లైన్ ద్వారా అయినా... ఆఫ్లైన్ అయినా కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేయలేదని తృణముల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ మానస్ భునియా అభిప్రాయపడ్డారు.
"ఆన్లైన్, ఆఫ్లైన్.. ఏ రకంగానైనా దేశంలో సీఏఏని అమలు చేయలేదు. సీఏఏని ప్రజలు వ్యతిరేకిస్తుండటమే ఇందుకు కారణం. చట్టాన్ని ప్రజలపై రుద్దలేరు. ప్రజాస్వామ్య దేశంలో అలా జరగదు."
--- భునియా, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ.
అయితే.. పౌరసత్వ చట్ట సవరణను మమతా బెనర్జీ ఆపలేరని బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. దేశవ్యాప్తంగా సీఏఏ అమలవుతుందన్నారు.