భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంటబీమా పథకం రైతులను దోపిడి చేసి ధనిక వ్యాపారవేత్తల జేబులు నింపుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి బిహార్‌లో పర్యటించారు రాహుల్. నితీష్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మోదీలాగే బిహార్ ముఖ్యమంత్రి ఉత్తుత్తి హామీలు ఇచ్చారని ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్ రాజకీయలపైనా రాహుల్ మాట్లాడారు. లాలు ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ముందుకెళుతుందని స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిహార్ యువతను చిన్నచూపు చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ విఫలమయ్యారని రాహుల్ విమర్శించారు.
"బిహార్ యువతకు మీరు(మోదీ) ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ప్రతి ఏడాది రెండు కోట్లమంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. నరేంద్ర మోదీ వల్ల ఉద్యోగాలు పొందినవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు... రైతుల రుణాలను 10 రోజుల్లో మాఫీ చేస్తానని నేను ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో హామీ ఇచ్చాను. నేను అబద్ధాలు చెప్పను. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దేశానికి మార్గం చూపించిన పాట్నా విశ్వవిద్యాలయానికి కేంద్ర విశ్వవిద్యాలయ గుర్తింపునిస్తాం."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు.