భాగ్యనగర కీర్తి శిఖలో త్వరలో మరో కలికితురాయి చేరే అవకాశం ఉంది! దేశ ఆర్థిక రాజధాని ముంబయిని హైదరాబాద్‌తో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు పరుగులు పెట్టవచ్చు! త్వరలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో ముంబయి-హైదరాబాద్ మార్గం కూడా ఒకటి. "ఏడు కొత్త నడవాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను సిద్ధం చేయాలని జాతీయ హైస్పీడ్ రైలు కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్)ను కేంద్రం ఆదేశించింది. ఈ ఏడు ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.10 లక్షల కోట్లు" అని ఓ అధికారి వెల్లడించారు.
![centre to bring bullet train between Hyderabad and mumbai. plans for 6 more projects](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8803212_1073_8803212_1600126356570.png)
దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును ముంబయి-అహ్మదాబాద్ మధ్య (508.17 కిలోమీటర్లు) కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దాని అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. వాస్తవానికి ఆ మార్గంలో 2023 డిసెంబరులో బుల్లెట్ రైలు సేవలను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే- భూ సేకరణ సంబంధిత సమస్యలు, కొవిడ్ మహమ్మారి విజృంభణ వంటి ఆటంకాల కారణంగా ఆ ప్రారంభ తేదీని 2028 అక్టోబరుకు వాయిదా వేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముంబయి-అహ్మదాబాద్ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 63 శాతం భూ సేకరణ పూర్తయింది.