అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడానికి కేంద్రప్రభుత్వం 5 నగరాలను ఎంపిక చేసింది. దేశరాజధాని దిల్లీతోపాటు సిమ్లా, మైసూర్, అహ్మదాబాద్, రాంచీ ఈ జాబితాలో ఉన్నాయి. రెండోసారి కొలువుదీరిన మోదీ ప్రభుత్వం చేపట్టే మొదటి భారీ కార్యక్రమం ఇది.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే ప్రధాన వేదికను ఎంపిక చేయడానికి.... ప్రధానమంత్రి కార్యాలయానికి నగరాల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి.
"అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాం. ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తాం."
- ఆయుష్ మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి
వేదిక దిల్లీ అయితే...
పీఎంఓ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాన వేదికగా దిల్లీని ఎంపిక చేస్తే... 2015 తరువాత హస్తిన మళ్లీ ఆ అవకాశం అందిపుచ్చుకున్నట్లు అవుతుంది.
రెండు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాన్ని... దిల్లీలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో యోగా గురువులు, నిపుణులు, ఔత్సాహికులు సహా 10 వేలమంది పాల్గొనే అవకాశం ఉంది.
అంతర్జాతీయంగా గుర్తింపు..
సుమారు ఐదు వేల సంవత్సరాలుగా భారత్‌లో ప్రాచుర్యంలో ఉన్న యోగాను... ఐక్యరాజ్యసమితి గుర్తించి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. 2014లో ఈ విశిష్ట గుర్తింపు పొందిన తర్వాత... 2015లో మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి 191 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: రయ్ రయ్: బైక్‌లపై కాశీ టు లండన్