జాతీయ పౌర రిజిస్టర్ తుది జాబితా (ఎన్ఆర్సీ) విడుదల నేపథ్యంలో అసోంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఎలాంటి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. ఇప్పటికే 167 కంపెనీల బలగాలను రంగంలోకి దించగా.. అదనంగా మరో 51 కంపెనీలను మోహరించారు.
అన్ని కోణాల్లో భద్రతను పరిశీలించి ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలు తీసుకుంటున్నట్లు అసోం డీజీపీ కులధర్ సైకియా తెలిపారు. సామాజిక మాధ్యమాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసోం ప్రజలు శాంతియుతంగా ఉంటారని భావిస్తున్నామన్నారు డీజీపీ. అసోం పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
మొత్తం 2,500 ఎన్ఆర్సీ సేవాకేంద్రాలకు గానూ.. 1200 కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని కులధర్ తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసున్నామన్నారు.
ఇదీ చూడండి: నేడు ఎన్ఆర్సీ విడుదల... అసోంలో భయాందోళనలు!