ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నావ్ అత్యాచార కేసు బాధితురాలి రోడ్డు ప్రమాదంపై విచారణ చేపట్టే బాధ్యతలను సీబీఐకి అప్పగించింది కేంద్రం. ఆదివారం రాయ్‌బరేలిలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరు ప్రమాదంలో మరణించారు.
రోడ్డు ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని బాధితురాలి బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో నిందితుడు, భాజపా ఎమ్మెల్యే కుల్దీప్ సెన్గర్తో పాటు మరో 8 మందిపై హత్య కేసు నమోదైంది. రోడ్డుప్రమాదంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. భాజపా ప్రభుత్వంపై మండిపడ్డాయి.
ప్రాణ హానిపై సీజేఐకి ముందుగానే లేఖ
ఉన్నావ్ అత్యాచార కేసు నిందితుని నుంచి తమకు ప్రాణహాని ఉందని బాధితురాలి కుటుంబ సభ్యులు ముందుగానే భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి కార్యాలయానికి హిందీలో లేఖ అందినట్లు సుప్రీంకోర్టు అధికారి తెలిపారు. దీనిపై నోటు సిద్ధం చేసి తన ముందుంచాలని కోర్టు సెక్రెటరీ జనరల్‌కు సూచించారు జస్టిస్ గొగొయి.
జులై 12వ తేదీతో హిందీలో లేఖ అందినట్లు చెప్పారు అధికారి. ఈ లేఖను అలాహాబాద్ హైకోర్టుకు పంపించినట్లు చెప్పారు.