దేశ రాజధానిలో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో కొవిడ్-19 రోగుల సంరక్షణ సేవలు, సౌకర్యాలను తనిఖీ చేయడానికి, వాటిని మెరుగుపరిచే చర్యలను సూచించడానికి నిపుణులతో కూడిన మూడు బృందాలను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి, దిల్లీ ముఖ్య కార్యదర్శికి బుధవారం నాటికి నివేదిక సమర్పించాలని బృందాలను ఆదేశించింది.
ప్రతి బృందంలో ఎయిమ్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్(డీజీహెచ్ఎస్), దిల్లీ ప్రభుత్వం, మునిసిపల్ కార్పొరేషన్లు/కౌన్సిల్ నుంచి ఒక్కొక్కరు చొప్పున నలుగురు వైద్యులు ఉంటారు. ఈ బృందాలు సమర్పించిన నివేదిక... సకాలంలో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు.
రాపిడ్ యాంటిజెన్ కిట్‌లతో వైరస్ పరీక్షలు
దిల్లీలోని కంటైన్మెంట్ జోన్లు, హెల్త్‌కేర్ సెట్టింగుల్లో జూన్ 20 నుంచి కొవిడ్-19 పరీక్షలకు రాపిడ్ యాంటిజెన్ కిట్‌లను ఉపయోగించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహించకుండానే వేగంగా వ్యాధి నిర్ధరించడానికి ఈ కిట్లను అనుమతించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సిఫారసు చేసింది. దిల్లీలో సుమారు 240 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.
ఇప్పటికే దిల్లీలో మొత్తం 42,829 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1400 మంది కరోనాతో మరణించారు.
ఇదీ చూడండి: కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం