'ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు' విధానానికి కేంద్రం సిద్ధమయింది. దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు తీసుకురానున్నట్లు కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాసవాన్ ప్రకటించారు. ఫలితంగా దేశంలో ఎక్కడినుంచైనా సరుకులు పొందవచ్చని తెలిపారు.
ఆహార భద్రతపై కేంద్రం, రాష్ట్రాల్లోని సంబంధిత అధికారులు, ఆయా శాఖల కార్యదర్శులతో పాసవాన్ దిల్లీలో సమావేశమయ్యారు. జాతీయ ఆహార భద్రత చట్టం అమలు, కంప్యూటరైజేషన్, చౌక ధరల సరకుల నిల్వ, పంపిణీలో పారదర్శకత, ఎఫ్‌సీఐ, సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ డిపోలను ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలను చర్చించారు.
ఎక్కడికి వెళ్లినా ఆహార భద్రత
ఇదే సమావేశంలో రేషన్ కార్డు అంశంపైనా మంత్రి చర్చించారు. నూతన విధానంలో వివిధ రాష్ట్రాలకు తరలివెళ్లే వలసదారులు దేశంలో తమకు అందుబాటులోని దుకాణం నుంచి సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఈ విధానంతో అవినీతికి ఆస్కారం తక్కువగా ఉంటుందని,ఆహార భద్రత పథకం వృథా కాదని పేర్కొన్నారు.
ఇప్పటికే ఏపీ, తెలంగాణ, గుజరాత్, హరియాణా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల్లో ఇంటిగ్రేటెడ్ పీడీఎస్ (ఐఎంపీడీఎస్) వ్యవస్థ అమలులో ఉంది. దీని ప్రకారం ఆయా రాష్ట్రాల్లోని లబ్ధిదారులు ఏ జిల్లాలోనైనా సరుకులు పొందవచ్చు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తామని గతంలో ముందుకొచ్చాయి.
తెలుగు రాష్ట్రాల నుంచే మొదలు
ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు’ విధానాన్ని రాబోయే రెండు నెలల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దశల వారీగా దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరిస్తారు. దీంతో పాటు అన్ని రేషన్ కార్డులను ఒకే చోట నిక్షిప్తం చేసి నకిలీలకు ఆస్కారం లేకుండా చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఇదీ చూడండి: హోమియోపతి, సెజ్ బిల్లులకు ఆమోదం