లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ వలస కూలీలు భారీ సంఖ్యలో స్వరాష్ట్రాలకు వెళ్తున్న వేళ.. కేంద్రం మరిన్ని మార్గదర్శకాలు ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కనీసం 14 రోజుల క్వారంటైన్‌కు తరలించాలని ఆదేశించింది. లాక్‌డౌన్ కొనసాగినంత కాలం వలస కూలీలు నగరాలు, జాతీయ రహదారుల వెంట వెళ్లకుండా.. సరిహద్దులను మూసివేయాలని స్పష్టంచేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, డీజీపీలతో.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా..వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కాన్ఫరెన్స్‌లోని మరిన్ని అంశాలు
- రాష్ట్ర, జిల్లాల సరిహద్దులను తప్పనిసరిగా మూసివేయాలి
- సరకు రవాణా మినహా జాతీయ రహదారులు, పట్టణాల్లో ఎటువంటి రవాణా జరగరాదు
- జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు దీనికి బాధ్యత వహించాలి
- సమయానుకూలంగా దినసరి కూలీలకు చెల్లింపులు జరపాలి. పేమెంట్ల విషయంలో ఒక్క రోజు కూడా తగ్గించకుండా చెల్లించాలి.
- విద్యార్థులు, అద్దెకు ఉండే వారికి అవసరమైన సహకారాన్ని ఇవ్వాలని, అద్దె డిమాండ్ చేసే ఇంటి యజమానులపై చర్యలకు వెనుకాడవద్దని సూచన.
- సరిహద్దుల్లో ఉన్న దినసరి కూలీలను వెంటనే.. 14 రోజుల పాటు నిర్బంధ పర్యవేక్షణకు పంపాలి.
- అవకాశం ఉన్నంత వరకు జాతీయ రహదారుల పక్కనే నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
- రహదారులపై ఒక్క వ్యక్తి కూడా తిరగకుండా చర్యలు తీసుకోవాలి.
పార్సిల్ వ్యాన్లు...
దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా.. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పార్సిల్ వ్యాన్లను నడపనున్నట్టు తెలిపింది. దిల్లీ-గువాహటి, దిల్లీ-ముంబయి, దిల్లీ-కల్యాన్, దిల్లీ-హౌడా, ఛండిగఢ్-జైపూర్, మొగ-ఛంగ్సారి మార్గాల్లో ఈ పార్సిల్ వ్యాన్లు నడవనున్నట్టు స్పష్టం చేసింది.
ఏపీఏఆర్...
ఉద్యోగుల పనితీరుపై ఇవ్వాల్సిన నివేదికకు ఉన్న గడువును కేంద్రం పొడిగించింది. కేంద్రానికి చెందిన గ్రూప్-ఏ అధికారుల బ్లాంక్ ఆన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైసల్ రిపోర్టు(ఏపీఏఆర్)ను ఈ నెల 31లోగా సమర్పించాల్సి ఉంది. అయితే తాజాగా ఆ గడువులను మే 31వరకు పొడిగించింది కేంద్రం.