వలస కూలీలను తమ స్వస్థలాలకు చేర్చడానికి మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం రైల్వేశాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. మహిళలు, చిన్నారులు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం చేసింది కేంద్రం. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు.
కరోనా వైరస్‌పై భయం, జీవనోపాధి కోల్పవడం వల్లే వలస కార్మికులు తమ ఇళ్లకు చేరుతున్నారని భల్లా పేర్కొన్నారు. వారికి వసతి గృహాలు, ఆరోగ్య, ఆహార అవసరాల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రైళ్లు, బస్సులు బయలుదేరే సమయాలపై మరింత స్పష్టత ఉండాలని అభిప్రాయపడ్డారు భల్లా. అస్పష్టత వల్ల వదంతులు వ్యాప్తి చెంది వలసదారుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయని తెలిపారు. పాదయాత్ర చేస్తున్న వారిని.. సమీప బస్సు, రైల్వే స్టేషన్‌కైనా, వసతి గృహాలకైనా తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి.
ఇదీ చూడండి:- బస్సు, ట్రక్కు ఢీ- 9 మంది కూలీలు మృతి!