జనాభా లెక్కలు సేకరణలో కులాల వారీగా లెక్కలు తేల్చాలని కొన్ని రాష్ట్రాల డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. అలాంటిది లేకుండానే 2021లో జనాభా వివరాల సేకరణకు రంగం సిద్ధం చేస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారు (ఎస్‌ఈబీసీలు), ఇతర వెనుకబడినవారు (ఓబీసీలు), మిగిలిన కులాల వివరాలను సేకరించడం లేదు. ఈ విషయంలో మహారాష్ట్ర, బిహార్ శాసనసభలు చేసిన డిమాండ్లను తిరస్కరించినట్లే ఒడిశాలోని అధికార బిజద లోక్‌సభలో చేసిన డిమాండునూ కేంద్రం తోసిపుచ్చింది. ‘సామాజిక-ఆర్థిక కుల గణన’ (ఎస్‌ఈసీసీ) సమాచారాన్ని వినియోగించుకునేందుకు వీలు కల్పించాలని దేశవ్యాప్తంగా ఓబీసీల ఉప వర్గీకరణకు నియమితమైన జాతీయ కమిషన్ చేసిన అభ్యర్థననూ ప్రభుత్వం తిరస్కరించింది. కులాల వారీగా వివరాలు సేకరిస్తే జనాభా లెక్కల సేకరణ ప్రాథమిక ఉద్దేశానికే విఘాతం కలుగుతుందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఏప్రిల్‌లో శ్రీకారం
2021 జనగణన కార్యక్రమం రెండు దశల్లో జరగనుంది. తొలిదశకు ఈ ఏడాది ఏప్రిల్/ మే నెలల్లోనే శ్రీకారం చుడతారు. ఇళ్ల సంఖ్యను లెక్కించడం, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)ను తాజాపరచడం వంటివి ఈ దశలో ఉంటాయి.
- 2021 తొలినాళ్ల నుంచి రెండో దశలో జనగణన మొదలవుతుంది. ఆ మేరకు పునఃపరిశీలనను వచ్చే ఏడాది మార్చిలో చేపడతారు.
- జనాభా లెక్కలకు ఈసారి నుంచి పెన్ను, కాగితాలతో పని ఉండదు. మొత్తం పనిని మొబైల్ యాప్ ద్వారా పూర్తి చేస్తారు.
- క్షేత్రస్థాయి గణకుల్లో ఒక్కొక్కరూ సుమారు 150 ఇళ్లకు వెళ్తారు. 600 నుంచి 800 మంది వివరాలను సేకరిస్తారు.
- ఇంటింటికీ వెళ్లినప్పుడు కుటుంబ యజమాని మొబైల్ నంబరు, ఇంట్లో ఉన్న మరుగుదొడ్ల సంఖ్య, టీవీ, ఇంటర్నెట్, సొంత వాహనాలు, తాగునీటి వనరులు వంటి వివరాలన్నీ తీసుకుంటారు.
- దళితులు, గిరిజనుల వివరాలతో పాటు, ఏ మతానికి చెందినవారు ఎంతమంది ఉన్నారనేది తెలుసుకుంటారు.
రాజ్యాంగంలో అలాంటి ఆదేశం లేదు
ఓబీసీల లెక్కల సేకరణకు రాజ్యాంగంలో ఎలాంటి ఆదేశాలు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీల లెక్కల్ని తీసుకోవాలనే రాజ్యాంగం చెబుతోంది. దేశంలో ఓబీసీ కులాలు దాదాపు 6285 ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితా ప్రకారమైతే ఈ సంఖ్య 7200. ఒకే కులాన్ని వేర్వేరు రాష్ట్రాలు భిన్నమైన జాబితాల్లో చేర్చడం, ఇతరత్రా తలెత్తే కొన్ని సందేహాల వల్ల అనేక వేలమంది వివరాలు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. కులాలు, ఉపకులాలు, గోత్రాల పరమైన అంశాలు దీనికి ఆస్కారమిస్తాయి. కులాల పేర్లను ఉచ్చరించడంలో ఉన్న ధ్వనిపరమైన సారూప్యతలూ తప్పుడు వర్గీకరణకు అవకాశం కల్పిస్తాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఓబీసీ లెక్కల జోలికి వెళ్లకూడదని కేంద్రం నిర్ణయించింది.
అలాంటి గణన స్వాతంత్య్రానికి పూర్వమే
కులాలవారీగా జనగణనను చివరిసారిగా 1931లో చేపట్టారు. స్వాతంత్య్రానంతరం ఎస్‌ఈసీసీ ద్వారా 2011లో యూపీయే-2 పాలనలోనే తొలిసారిగా కసరత్తు మొదలయింది. దానిలో ఉన్న వివరాలను మాత్రం మోదీ నేతృత్వంలోని గత ప్రభుత్వం బయటపెట్టలేదు. ఆర్థిక గణాంక సమాచారమే తమకు ముఖ్యమని, ప్రభుత్వ పథకాల అమలుకు అది దోహదపడుతుందని ఎన్డీయే సర్కారు పేర్కొంటూ వచ్చింది. ఎస్‌ఈసీసీ వివరాల విశ్లేషణకు నిపుణుల సంఘాన్ని నియమిస్తామని 2015లో కేంద్రం చెప్పినా అది అమల్లోకి రాలేదు. కేంద్ర, రాష్ట్ర జాబితాల్లోని కులాలపై అస్పష్టత ఉన్నప్పుడు దానిని తొలగించడంపై జస్టిస్ జి.రోహిణి నేతృత్వంలోని ఓబీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఈ కమిషన్ గడువు ఈ ఏడాది జనవరి 31తోనే ముగిసిపోగా ఆరు నెలల అదనపు సమయాన్ని ప్రభుత్వం ఇచ్చింది.