దేశ భద్రతను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా త్రివిధ దళాలకు ఉమ్మడి సారథ్యం వహించే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) నియామకానికి పచ్చ జెండా ఊపిన కేంద్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీడీఎస్ పదవికి గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు సైనిక నిబంధనలు-1954లో మార్పులు చేస్తూ.. రక్షణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
రక్షణ దళాల సిబ్బందికి కొత్త నాయకత్వం కోసం.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను ఏర్పాటు చేస్తూ, ఇటీవల కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ పదవిలో ఉన్న వ్యక్తి మూడు దళాలకు సంబంధించి.. రక్షణ మంత్రికి ప్రధాన సైనిక సలహాదారుగా వ్యవహరిస్తారు.
పదవీ కాలంపై..
ప్రస్తుతం ఉన్న నియమాల ప్రకారం సైనిక విభాగాల అధిపతులు గరిష్ఠంగా మూడేళ్ల పాటు లేదా.. పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల వరకు ఏది ముందు వస్తే దాని ప్రకారం పదవిలో ఉంటారు. అయితే.. ప్రస్తుతం ఏర్పాటు చేస్తోన్న సీడీఎస్ పదవీ కాలంపై స్పష్టత నివ్వలేదు కేంద్ర సర్కారు.
మరో పదవి చేపట్టకూడదు..
సీడీఎస్ పదవి దిగిపోయిన తర్వాత మరో ప్రభుత్వ పదవి చేపట్టడానికి అర్హులు కారని పేర్కొంది కేంద్రం. పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఐదేళ్ల వరకు ముందస్తు అనుమతి లేకుండా ఏ ప్రైవేటు ఉద్యోగం చేపట్టరాదని స్పష్టం చేసింది.
సీడీఎస్‌పై రేపే ప్రకటన..
ప్రస్తుత సైనిక దళ ప్రధానాధికారి బిపిన్ రావత్.. ఈ పదవి చేపట్టడానికి అవకాశాలున్నాయని తెలుస్తోంది. రేపు సీడీఎస్ నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. రాజౌరి జిల్లాలో ఐఈడీ గుర్తింపు