భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్ల డేటాను అక్రమంగా సేకరిస్తున్నారన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా, గ్లోబల్ రీసెర్చ్ సెంటర్లపై కేసు నమోదు చేసింది. దేశంలో జరిగే ఎన్నికలను ప్రభావితం చేసేందుకు.. ఫేస్‌బుక్ డేటాను ఉపయోగిస్తున్నట్లు అభియోగాలు మోపింది. తమ ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం వెల్లడైనట్లు సీబీఐ తెలిపింది.
2014లో పరిశోధన, విద్యా అవసరాల కోసం.. యూజర్ల డేటా సెట్ల తయారీ కోసం ఫేస్‌బుక్ అనుమతితో ప్రత్యేక యాప్‌ను గ్లోబల్ రీసెర్చ్ సెంటర్ రూపొందించింది. ఆ సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికాకు అందజేసినట్లు సీబీఐ ఆరోపించింది. ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా.. వ్యాపార అవసరాలకు ఉపయోగించుకునేందుకు అనుమతించటం ద్వారా గ్లోబల్ రీసెర్చ్ సెంటర్.. క్రిమినల్ నేరానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.