పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న ఆందోళనలకు సంబంధించి వెయ్యిమంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15న అలీగఢ్ వర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్శిటీలో విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ ధర్నా చేపట్టగా పరిస్థితులు అదుపు తప్పి ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.
ఆందోళనల పేరుతో హింసాత్మక ఘర్షణలకు పాల్పడుతున్న నిరసనకారులపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు గానూ నష్టపరిహారం చెల్లించాలంటూ పలువురికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన కొందరు నష్టపరిహారం కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. బులంద్‌శహర్‌కు చెందిన కొందరు ముస్లింలు 6 లక్షల 27 వేల రూపాయల డీడీలను ప్రభుత్వానికి చెల్లించినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.
ఇదీ చూడండి: 135 ఏళ్ల కాంగ్రెస్: దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీలు