భోపాల్ భాజపా అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌పై ప్రధాని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సేను దేశ భక్తుడని కీర్తించడాన్ని తప్పుబట్టారు. సాధ్వీ వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని, ఈ విషయంలో ఎప్పటికీ క్షమించబోనని స్పష్టం చేశారు.
"మహాత్మా గాంధీ లేదా నాథురాం గాడ్సే గురించి అలా వ్యాఖ్యానించటం చాలా తప్పు. ఈ రకమైన వ్యాఖ్యలు సమాజానికీ మంచివి కావు. మన సంస్కృతిలో ఇలాంటి భాషకు స్థానం లేదు. ఇలాంటి పనులకు పాల్పడే వారు వంద సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సాధ్వీ క్షమాపణలు కోరారు. కానీ ఎప్పటికీ ఆమెను క్షమించను."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఇదే రీతిలో స్పందించారు. గాడ్సేకు అనుకూలంగా వ్యాఖ్యానించిన భాజపా నేతలపై అంతర్గత విచారణ కమిటీని నియమించినట్టు తెలిపారు.
ఇటీవల భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ "హిందూ ఉగ్రవాది" ఆరోపణలకు గాడ్సే దేశభక్తుడంటూ సమాధానమిచ్చి వివాదానికి తెరలేపారు సాధ్వీ ప్రజ్ఞ. అనంతరం గాడ్సే విషయం తెరపైకి రావటం సంతోషంగా ఉందని అనంత్‌కుమార్ హెగ్దే ట్వీట్ చేశారు. విమర్శల నేపథ్యంలో ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని గాడ్సేతో పోలుస్తూ కర్ణాటక ఎంపీ కటీల్ ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: మోదీ పాలన విద్వేషం, వైఫల్యాలమయం: రాహుల్