మరాఠాల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన ప్రముఖ కార్టూనిస్ట్ బాల్‌ఠాక్రే 1966లో శివసేన పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి పలుమార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రభుత్వ పదవులను ఠాక్రే కుటుంబం పొందలేదు. అసలు... ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది కూడా లేదు. అలాంటిది తొలిసారి ఆ కుటుంబం నుంచి బాల్ ఠాక్రే మనువడు, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు అయిన ఆదిత్య ఠాక్రే దక్షిణ ముంబయిలోని వొర్లి నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఈ తురణంలో కెమ్ చౌ వొర్లి పేరిట ఆ ప్రాంతంలో ఆదిత్య ఠాక్రే బ్యానర్లు వెలిశాయి.
ఆదిత్య ఓ కళాకారుడు!
29 ఏళ్ల ఆదిత్య తాత మాదిరే కళాకారుడు. తండ్రి ఉద్ధవ్‌లా ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. కవితలు కూడా రాస్తారు. 'మై థాట్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్' పేరిట ఆదిత్య రాసిన కవితా సంపుటిని 2007లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆవిష్కరించారు. 'ఉమ్మీద్' అనే ప్రైవేట్ ఆల్బమ్‌కు ఆదిత్య పాటలు కూడా రాశారు. 2010 వరకూ ఓ కళాకారుడిగానే ప్రపంచానికి తెలిసిన ఆదిత్య.. 2010లో తొలిసారి ఠాక్రేల వారసత్వాన్ని ప్రదర్శించారు. యూనివర్శిటి ఆఫ్ ముంబైలో ఆంగ్ల సాహిత్యం పాఠ్యాంశంగా రోహిన్‌టన్ మిస్త్రీ రచించిన సచ్ ఏ లాంగ్ జర్నీ పుస్తకానికి వ్యతిరేకంగా ఆదిత్య ఆందోళన చేపట్టారు. అప్పటి నుంచి యువసేన అధ్యక్షుడి హోదాలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు.
పోరాటాలకు వెనుకాడని ఆదిత్య
న్యాయవిద్య కూడా పూర్తి చేసిన ఆదిత్య ఎక్కువగా ప్రజాసమస్యలు, యవత సమస్యలపై గళమెత్తుతూ ఉంటారు. ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తూ.. మహారాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం వెనుక ఆదిత్యఠాక్రే పోరాటం కూడా ఓ కారణం. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా ముంబైలో రాత్రిళ్లు కూడా వాణిజ్య సముదాయాలు తెరిచే ఉండాలంటూ ఆదిత్య ఉద్యమం తీసుకొచ్చారు. ఆదిత్య పోరాటంతో శివసేన అధికారంలో ఉన్న బృహన్ ముంబై నగరపాలక సంస్థ దిగొచ్చి అనుమతులివ్వగా.. దస్త్రం ముఖ్యమంత్రి దగ్గర ఆగి ఉంది. ఆదిత్య ఉద్యమాలు చాలా వరకు విజయం సాధించాయి. కొన్నింటిలో మాత్రం పూర్తిస్థాయిలో ఫలితాలు అందుకోలేక పోయారు. అలాంటి వాటిలో 'ఓపెన్ జిమ్నాజియం'లు ఒకటి. అధికారుల నుంచి అనుమతులు లేకుండానే మొదలు పెట్టినందున అవి కార్యరూపం దాల్చలేదు.
శివసేన శ్రేణుల్లో నవోత్తేజం
ఇన్ని ప్రత్యేకతలున్న ఆదిత్య తొలిసారి ఠాక్రే కుటుంబం నుంచి నేరుగా ఎన్నికల బరిలో నిలిచారు. వొర్లి ప్రజల ఆశీర్వాదం ఆదిత్యకు దక్కుతుందో లేదో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకూ ఆగాల్సిందే. ఇటీవల మిత్రపక్షం భాజపా దూకుడుతో కాస్త వెనక్కితగ్గాల్సిన పరిస్థితిలో ఉన్న శివసేనకు ఆదిత్య కొత్త వెలుగులు అందిస్తారని శివసేన శ్రేణులు ఆశిస్తున్నారు.