పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్లో స్పందించారు. భారత దేశానికి ఇదొక మైలురాయని అభివర్ణించారు. సోదరభావానికి, దయాగుణానికి పౌర సవరణ బిల్లు అద్దంపడుతోందని ట్వీట్ చేశారు మోదీ. బిల్లుకు మద్దతు తెలిపిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా హింసను ఎదుర్కొంటున్న శరణార్థులకు ప్రతిపాదిత చట్టం ఉపశమనం కలిగిస్తుందన్నారు.
పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడం రాజ్యాంగ చరిత్రలో చీకటి రోజన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. భారతదేశ భిన్నత్వంపై సంకుచిత మనస్కులు, మూర్ఖ శక్తులు విజయం సాధించాయని వ్యాఖ్యానించారు.
భాజపా హర్షం
పౌరసత్వ సవరణ బిల్లు ప్రతిపాదిత చట్టం చరిత్రాత్మకమని భాజపా హర్షం వ్యక్తం చేసింది. కోట్లాది మంది శరణార్థుల కలలను ఈ బిల్లు సాకారం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు.
దిల్లీలో సంబరాలు..
పౌర బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందినందుకు దిల్లీలోని మజ్ను కాతిలా ప్రాంతంలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు పాకిస్థానీ హిందువులు. స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. భారత్ మాతాకి జై.. జై హింద్ అంటూ నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: వివాదాస్పద 'పౌర' బిల్లుకు పార్లమెంట్ ఆమోదం