పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)పై ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర నిరసన జ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. మసీదుల్లో శుక్రవారం ప్రార్థన తర్వాత అవి మరింత ఉద్ధృత రూపం దాల్చాయి. అయితే ఈ అల్లర్లలో ఓ పోలీసు కానిస్టేబుల్‌కి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అయితే బుల్లెట్ కానిస్టేబుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ నుంచి చొచ్చుకుపోయి జేబులో ఉన్న 'మనీ పర్స్'కి తగిలి దానిలోనే ఆగిపోయింది. దీనితో అతనికి తృటిలో ప్రాణాపాయం తప్పినట్లైంది.
పర్సులో దేవుడి చిత్రాలు
"నేను నలబంద్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాను. అనుకోకుండా ఆందోళనకారుల్లో ఎవరో కాల్పులు జరిపారు. నా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ నుంచి చొచ్చుకుపోయి నా జేబులో ఉన్న పర్సులో చిక్కుకుపోయింది. పర్సులో నాలుగు ఏటీఎం కార్డులు, సాయి బాబా, శివుడి చిత్రాలు ఉన్నాయి. నాకు ఇది పునర్జన్మగా భావిస్తున్నాను" - విజేంద్ర కుమార్, కానిస్టేబుల్.
దీనిపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి స్పందిస్తూ.. యూపీ పోలీసుల నిబద్ధతకు ఈ ఘటనే నిదర్శనమని తెలిపారు. ఆందోళనలను అదుపు చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు.
సీఏఏ నిరసనలు
సీఏఏకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఘర్షణల్లో ఇప్పటి వరకు 15మంది పౌరులు మరణించారు. పోలీసులు మరో 705మందిని అదుపులోకి తీసుకున్నారు. 124 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.