పొరుగు దేశాల్లో మతపరంగా చిత్రహింసలు పడి భారత్కు వలస వచ్చిన వారి కోసమే పౌరసత్వ చట్ట సవరణను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. భారత్లోని ఏ మతాలవారి పౌరసత్వాన్ని తొలగించడానికి మాత్రం కాదని శిక్షణలో ఉన్న బంగ్లాదేశ్ దౌత్యవేత్తల సమావేశంలో వెల్లడించారు.
ఈశాన్య భారతదేశంలో జరుతున్న నిరసనల కారణంగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ మొమెన్, హోంమంత్రి అసదుజ్జమన్ ఖాన్ భారత పర్యటన రద్దు చేసుకున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.
మయన్మార్ నుంచి వస్తున్న వేలాది మంది శరణార్థులకు బంగ్లాదేశ్ ఆశ్రయం కల్పిస్తూ మానవత్వం ప్రదర్శించిందని కొనియాడారు వెంకయ్య.
పాక్ ప్రయత్నాలకు గండి
పొరుగుదేశాలతో భారత్ ఎప్పుడూ ప్రశాంత వాతావరణమే కోరుకుంటుందన్నారు వెంకయ్య. కశ్మీర్ సమస్య సమసిపోయిందని, సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి పొరుగుదేశం చేసే ప్రయత్నాలకు గండి కొట్టామని పరోక్షంగా పాక్నుద్దేశించి వ్యాఖ్యానించారు.
ఐరాసను ప్రక్షాళన చేద్దాం
ఐక్యరాజ్యసమితి వంటి బహుళార్ధక సంస్థలను ప్రక్షాళన చేయడానికి బంగ్లాదేశ్ సహకారం కావాలని కోరారు. తద్వారా ప్రపంచ దేశాలపై ప్రభావాన్ని చూపే విధానాలను కేవలం కొన్ని దేశాలు కలిసి తీసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ భారత్కు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్న వెంకయ్య... 2041 వరకు అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలన్న ఆ దేశ లక్ష్యంలో భారత్ భాగస్వామ్యం కావాలనుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'పౌర' సెగ: కేరళ హర్తాళ్ హింసాత్మకం- 200 మంది అరెస్ట్