దిల్లీలోని ఓ బ్యాటరీ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సహాయ చర్యలు చేపడుతుండగా పేలుడు సంభవించి భవనం కుప్పకూలింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహా అందులోని కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని బయటకు తెచ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో 13 మంది అగ్నిమాపక సిబ్బంది సహా మొత్తం 14 మంది గాయపడ్డారు. ఫ్యాక్టరీ సెక్యురిటీ గార్డ్ సైతం గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. మరొక వ్యక్తి శిథిలాల కింద ఉన్నట్లు వెల్లడించారు.
తెల్లవారుజామున ప్రమాదం
ఈ తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో పీర్గఢి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలో మంటలుచెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే 7 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో పేలుడు సంభవించి ఫ్యాక్టరీ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది కూడా శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 35 అగ్నిమాపక యంత్రాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి.
కేజ్రీవాల్ స్పందన
ఈ ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. మంటలు అదుపుచేయడానికి అగ్ని మాపక దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.