దిల్లీ ఘర్షణలపై దద్దరిల్లిన పార్లమెంట్.. రాజ్యసభ రేపటికి వాయిదా
దిల్లీ ఘర్షణలపై రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. దిల్లీ సీఏఏ వ్యతిరేక ఘర్షణలపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో గందరగోళం మధ్యే సభాకార్యకలాపాలు కొనసాగాయి. రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే దిల్లీ ఘర్షణలపై విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. దిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో సమయానుకూలంగా చర్చ చేపట్టేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ముందస్తు ప్రణాళిక మేరకు సభను సాగనివ్వాలని ఛైర్మన్ చేసిన విజ్ఞప్తిని విపక్షసభ్యులు పట్టించుకోకుండా నినాదాలు చేసిన నేపథ్యంలో మొదటిసారి రెండుగంటల వరకు వాయిదా వేశారు ఛైర్మన్.
సభ తిరిగి ప్రారంభమైన అనంతరమూ విపక్షసభ్యులు సభను సజావుగా సాగనివ్వలేదు. సభలో గందరగోళం నెలకొన్న కారణంగా డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ రేపటికి వాయిదా వేశారు.
4 గంటలవరకు లోక్‌సభ
జేడీయూ ఎంపీ వైద్యనాథ్ ప్రసాద్ మహతో మృతికి సంతాప సూచకంగా రెండు గంటల వరకు మొదటిసారి వాయిదా పడింది లోక్‌సభ. అనంతరం సభా కార్యకలాపాలు పునః ప్రారంభమైనప్పటికీ గందరగోళం కొనసాగిన నేపథ్యంలో రెండోసారి మూడు గంటలవరకు వాయిదా వేశారు. అనంతరం దిల్లీ ఘర్షణలపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో ప్యానెల్ స్పీకర్ రమాదేవి సాయంత్రం నాలుగు గంటలవరకు వాయిదా వేశారు.
అధికార, విపక్ష సభ్యుల బాహాబాహి
రెండు గంటలకు సభ పునఃప్రారంభమైన అనంతరం విపక్ష సభ్యులు హోంమంత్రి అమిత్‌షా రాజీనామాకు డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌కు రక్షణగా వెల్‌లోకి వచ్చారు భాజపా సభ్యులు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య బాహాబాహి జరిగింది.
గందరగోళంపై ప్రభుత్వం అసహనం..
లోక్‌సభలో విపక్ష సభ్యుల నినాదాలపై స్పందించారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి. 1984లో 3వేలమంది ఊచకోతపై ఎలాంటి చర్యలు తీసుకోని వారు ప్రస్తుతం గందరగోళం సృష్టిస్తున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.