ఈ క్రమంలోనే ఓ హెలికాప్టర్‌ను గమనించిన మన వైమానిక దళం శత్రువుదనుకుని దాన్ని క్షణాల్లో కూల్చేసింది. ఆ హెలికాప్టర్ రాడార్ మన సైన్యానికి సిగ్నల్ ఇవ్వకపోవటమే ఈ కూల్చివేతకు కారణం.
శత్రువా, మిత్రుడా అని తెలిపే ఒక బటన్ హెలికాఫ్టర్‌లో ఉంటుంది. దీనిని పైలట్ ఆన్ చేయకపోవడం వల్ల అది మన దేశానికి చెందిన ఛాపర్ అని అధికారులు గుర్తించలేకపోయారు. శత్రుదేశానికి చెందినదిగా భావించి యుద్ధ విమానాల ద్వారా లాంఛర్లను పంపి కూల్చేశారు.
శత్రువా, మిత్రుడా అని గుర్తించే మీటను ఆంగ్లంలో 'ఫ్రెండ్ ఆర్ ఫో' అని పిలుస్తారు. ఈ మీట రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్‌లో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
"ఏ వాయు ప్రమాదంలోనైనా విచారణ న్యాయస్థానం ప్రమాదానికి గల కారణాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ఘటనలోనూ ప్రమాదానికి కారణమేమై ఉంటుందోనని విశ్లేషిస్తుంది. కోర్టు ఏ విషయమూ వెల్లడించకముందే వ్యాఖ్యానించడం సరైనది కాదు "
- వైమానిక దళాధికారి
ప్రమాద సమయంలో ఛాపర్‌ను స్క్వాడ్రన్ లీడర్ సిద్ధార్థ్ విశిష్ఠ్ నడుపుతున్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో ఉదయం 10.10 కి గాల్లోకి లేచిన హెలికాఫ్టర్ కొద్ది సేపటికే కూలిపోయింది. అదే రోజు ఉదయం 9.30 గంటలకు పాకిస్థాన్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించాయి. పాక్ విమానాల్ని భారత వాయుసేనలు సమర్థంగా తిప్పికొట్టాయి.