జమ్మూ కతువా జిల్లాలోని భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దులో ఓ సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్) బుధవారం గుర్తించాయి. హీర్నగర్ సెక్టార్లోని బాబియాన్ గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ సొరంగం బయటపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
పాకిస్థాన్ నుంచి అక్రమంగా ఉగ్రవాదులు చొరబడేందుకు ఆ సొరంగ మార్గం ఏర్పాటు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.
గత ఆరునెలల్లో..
గత ఆరు నెలల్లో సాంబా, కతువా జిల్లాల్లో అధికారులు కనుగొన్న మూడో సొరంగం ఇది.
"సుమారు 150 మీటర్లు పొడవున్న సొరంగాన్ని గుర్తించాం. పాకిస్థాన్లోని షకెర్గర్హ్ గ్రామానికి ఈ సొరంగం అనుసంధానమై ఉంది."
-ఎన్ఎస్ జమ్వాల్, బీఎస్ఎఫ్ ఐజీ
పాక్ హస్తం..
ఈ సొరంగం నిర్మాణంలో పాక్ హస్తం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని జమ్వాల్ అన్నారు. పాకిస్థాన్ గుర్తులతో ఉన్న ఇసుక బస్తాలు తమకు లభించాయన్నారు. ఇటువంటివే ఇదివరకు గుర్తించిన సొరంగాల వద్ద కూడా స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. అయితే ఎటువంటి చొరబాట్లు జరగలేదన్నారు.