చారిత్రక అన్యాయాన్ని సరిచేసేందుకే పౌరచట్టాన్ని తీసుకొచ్చామన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. దిల్లీలో ఎన్సీసీ విద్యార్థుల వార్షిక ర్యాలీలో పాల్గొన్న ఆయన వారి గౌరవ వందనాన్ని స్వీకరించారు. యువ భారత్ సమస్యలకు పరిష్కారాలను కోరుకుంటోందని వ్యాఖ్యానించారు.
దేశంలో ఇటీవల తీసుకొచ్చిన చట్టాలు, విధానాలను విద్యార్థులకు వివరించారు ప్రధాని.
"గతంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని కలిసిపని చేయాలి. విద్యార్థులు ఎన్సీసీలో చేరాక చాలా కష్టపడతారు. చదువుతో పాటు గంటలపాటు పరేడ్ చేస్తూ ఉంటారు. విద్య, ఇతర కార్యక్రమాలు.. అంతా ఒక్కసారే నడుస్తూ ఉంటుంది. మీలో చదువును కొనసాగిస్తూనే.. దేశం కోసం ఏదైనా చేస్తాం అనే స్ఫూర్తి ఉంటుంది. కానీ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి. రోజూ భారత సార్వభౌమాత్వానికి వ్యతిరేక వార్తలు వస్తున్నాయి. కానీ వాటిని స్వీకరించేందుకు యువభారత్ సిద్ధంగా లేదు."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
స్వతంత్రం వచ్చిన నాటి నుంచే జమ్ముకశ్మీర్లో సరిహద్దు సమస్య ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కొన్ని రాజకీయ పార్టీలు ప్రాంతీయ భావాలను, ఉగ్రవాదాన్ని పెంచే విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. భారత్తో మూడు యుద్ధాల్లో ఓడిపోయిన పాకిస్థాన్ అనంతరం పరోక్ష యుద్ధాన్ని ప్రేరేపిస్తుందన్నారు. ఉగ్రదాడుల్లో వందలమంది సైనికులు చనిపోతున్నా సైన్యం ప్రతిస్పందించేందుకు గత ప్రభుత్వాలు అనుమతించలేదన్నారు. ఏళ్లుగా నలిగిపోతున్న సమస్యల పరిష్కారానికి వర్గపు మరకలను అంటించేవారి అసలు రూపును దేశ ప్రజలు చూస్తున్నారని పరోక్ష విమర్శలు చేశారు.
ఇదీ చూడండి: ఆప్రికా చిరుతలకు అనువైన ప్రాంతం ఎంపికకు సుప్రీం అనుమతి