సరైన వీసా ఉన్నప్పటికీ భారత్‌లోకి ప్రవేశించకుండా తనను అడ్డుకున్నారని బ్రిటన్‌కు చెందిన పార్లమెంట్ సభ్యురాలు డెబ్బీ అబ్రహమ్స్ ఆరోపించారు. గతంలో కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దుపై ఆందోళన వ్యక్తం చేసిన లేబర్ పార్టీకి చెందిన ఎంపీ... తనను దిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు పంపించినట్లు వెల్లడించారు.
తన కుటుంబ సభ్యులను కలిసేందుకు భారత్ వచ్చినట్లు తెలిపారు డెబ్బీ. ఎలాంటి వివరణ ఇవ్వకుండా తన వీసాను ఉపసంహరించినట్లు ఆరోపించారు. అధికారుల తీరును ట్విట్టర్ ద్వారా తీవ్రంగా తప్పుబట్టారు. తన వీసా ఎందుకు రద్దైందో అధికారులెవ్వరికీ తెలియకపోవడం బాధాకరమన్నారు.
"ఓ అధికారి నా వీసా రద్దు అయినట్లు చెప్పారు. తర్వాత నా పాస్‌పోర్ట్ తీసుకున్నారు. 10 నిమిషాల వరకు పాస్‌పోర్ట్ కనిపించలేదు. ఆయన తిరిగొచ్చి మొరటుగా వ్యవహరించాడు. తన వెంట రమ్మని అరిచాడు. అలా మాట్లాడొద్దని చెప్పినా వినిపించుకోలేదు. నన్ను నిర్బంధ ప్రాంతానికి తీసుకెళ్లి... ఆ ప్రాంతాన్ని బహిష్కరణ సెల్‌గా మార్క్ చేశారు. అక్కడ కూర్చోమని ఆదేశిస్తే నేను ఒప్పుకోలేదు. వారు ఏం చేస్తారో, ఇంకెక్కడికి తీసుకెళ్తారో నాకు తెలియలేదు. అందుకే ప్రజలు నన్ను చూడాలని అనుకున్నా."
-డెబ్బీ అబ్రహమ్స్, బ్రిటన్ ఎంపీ
ఖండించిన హోంశాఖ
అయితే డెబ్బీ అబ్రహమ్స్ ఆరోపణలను కేంద్ర హోంశాఖ ఖండించింది. 'ఈ-వీసా' రద్దైన విషయమై ఆమెకు సమాచారం అందించినట్లు స్పష్టం చేసింది. సరైన వీసా లేకుండా భారత్‌కు వచ్చినందునే తిరిగి పంపించినట్లు పేర్కొంది.
మరోవైపు ఫిబ్రవరి 13కు ముందు తనకు ఎలాంటి సమాచారం అందలేదని అబ్రహం చెప్పుకొచ్చారు.
బ్రిటీష్ హైకమిషన్ స్పందన
ఈ విషయానికి సంబంధించి భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దిల్లీలోని బ్రిటీష్ హైకమిషన్ ప్రతినిధి వెల్లడించారు. డెబ్బీని భారత్‌లోకి ఎందుకు అనుమతించలేదన్న విషయంపై స్పష్టత తీసుకుంటున్నట్లు తెలిపారు. దిల్లీ విమానాశ్రయంలో ఉన్న సమయంలో డెబ్బీకి దౌత్య సహాయం అందించినట్లు స్పష్టం చేశారు.
గత అక్టోబర్‌లో ఈ-వీసా జారీ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇది 2020 అక్టోబర్ వరకు చెల్లుబాటు అవుతుంది.
ఆర్టికల్-370 రద్దుపై లేఖ
కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్-370ను భారత ప్రభుత్వం రద్దు చేయడాన్ని వ్యతిరేకించిన లేబర్ పార్టీకి చెందిన ఎంపీల బృందంలో డెబ్బీ సైతం ఉన్నారు. ఆర్టికల్-370ను రద్దు చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ యూకే విదేశాంగ కార్యదర్శికి గతంలో లేఖ రాశారు. కశ్మీర్ వివాదంపై నియమించిన పార్లమెంటరీ బృందానికి అధ్యక్షత వహిస్తున్నారు.
రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు డెబ్బీ. అనంతరం మూడు రోజుల పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించనున్నట్లు సమాచారం.