రాజకీయంగా సున్నితమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసు విచారణతో సుప్రీం ఆనవాయితీకి తెరపడింది. ప్రతి సోమవారం, శుక్రవారం తాజా కేసులను మాత్రమే విచారణకు స్వీకరించే కోర్టు.. 3 రోజులుగా కొనసాగుతున్న అయోధ్య కేసు విచారణలో నేడూ వాదనలు విననుంది.
ఇరు వర్గాల న్యాయవాదుల అభ్యర్థనతో రోజువారీ విచారణ కొనసాగించేందుకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అంగీకరించింది.
సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం రోజువారీ వాదనలు మంగళవారం నుంచి గురువారం వరకు మాత్రమే వింటుంది. అయోధ్య భూవివాదం కేసులో మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైందన్న కారణంతో.. ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ చేపడుతోంది కోర్టు. ఇదే తరహాలో శుక్రవారమూ నాలుగో రోజు వాదనలు విననుంది. ఫలితంగా.. ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయాలకు తెరపడినట్లయింది.
ఇదీ వివాదం...
అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇదీ చూడండి: 'అపర చాణక్యుడు... ప్రణబ్ ముఖర్జీ దాదా'