ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా భారత్‌లోనూ చొరబడింది. అందుకే, ప్రాణాంతక వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. అయితే, మోదీ సందేశాన్ని ఇంకా విననివారికి, విని వదిలేసినవారికి.. మరోసారి గుర్తు చేస్తున్నాడు మధ్యప్రదేశ్ ఉజ్జయిన్‌కు చెందిన ప్రకాశ్ ప్రజాపతి.
ఆదివారం ప్రతి ఒక్కరు కర్ఫ్యూను పాటించి, కొవిడ్-19 పని పట్టాలని వీధివీధి తిరిగి విజ్ఞప్తి చేస్తున్నాడు.
మెహిద్పుర్ ప్రాంతానికి చెందిన ప్రకాశ్.. బ్రెడ్ వ్యాపారం చేస్తాడు. సైకిల్‌పై బ్రెడ్ ప్యాకెట్లు వేసుకుని ఊరూవాడా తిరుగుతాడు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జనతా కర్ఫ్యూ ఎంతో ఉపయోగపడుతుందని గ్రహించాడు ప్రకాశ్. అందుకే, మోదీ పిలుపును వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలనుకున్నాడు.
ఇంకేముంది, సైకిల్‌కు ఇలా ఓ మైకు ఏర్పాటు చేసి, మోదీ గళాన్ని ప్రజలకు వినిపిస్తూ ప్రశంసలు పొందుతున్నాడు.
"మోదీ ఇచ్చిన పిలుపును దేశ పౌరులంతా స్వాగతించాలి. నేను బ్రెడ్ వ్యాపారం చేస్తాను. సమాజంలోని ప్రతి వ్యక్తికి ఓ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నా. మోదీ చెప్పిన జనతా కర్ఫ్యూను ప్రతి ఒక్కరూ పాటించాలి. కరోనా వ్యాప్తిని అంతం చేయండి."
-ప్రకాశ్ ప్రజాపతి, బ్రెడ్ వ్యాపారి