ఒక ప్రసంగం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఎన్నో పనులకు ప్రేరేపిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్(సింగిల్ యూజ్ ప్లాస్టిక్) నిషేధించాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుకు ఓ యువకుడు ఆకర్షితుడైయాడు. ప్లాస్టిక్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సంకల్పించుకున్నాడు. అనుకోవటమే తడవుగా.. యూరప్‌లో ఉద్యోగాన్ని వదులుకొని స్వదేశానికి తిరిగొచ్చి దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టాడు. ఆయనే.. గుజరాత్‌కు చెందిన బ్రజేశ్ కుమార్.
గాంధీనగర్ నుంచి..
స్వరాష్ట్రం గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 17న సైకిల్ యాత్రను ప్రారంభించాడు బ్రజేశ్. సుమారు 23వేల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో యాత్రను ఆరంభించాడు.
"పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత భారత్‌పై అవగాహన కల్పిస్తున్నా. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి వాటిల్లుతున్న హాని గురించి ప్రచారం చేస్తున్నాను. ప్లాస్టిక్ వదిలేయాలని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నా. దేశవ్యాప్తంగా ఇలాగే చేస్తాను. ఇప్పటి వరకు గుజరాత్ సౌరాష్ట్రలో 500 కి.మీ పూర్తి చేసుకుని.. అక్కడి నుంచి రాజస్థాన్, హరియాణా, దిల్లీ, మధుర బృందావన్ దాటి 46 రోజుల తర్వాత ఆగ్రా చేరుకున్నాను. ఇక్కడ కూడా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను."
-బ్రజేశ్ కుమార్.
25 వేల విద్యార్థులకు..
ప్లాస్టిక్ వాడకంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని సంకల్పించుకుని.. తాను వెళ్లే ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను సందర్శిస్తున్నాడు బ్రజేశ్. ప్లాస్టిక్ వాడకం వల్ల వాతావరణంలో కలిగే మార్పులు, మూగ జీవాలకు కలుగుతున్న నష్టాల గురించి వివరిస్తున్నాడు. ఇప్పటి వరకు సుమారు 25 వేల విద్యార్థులకు అవగాహన కల్పించాడు.
ప్రస్తుతం ఆగ్రాలో ఉన్న బ్రజేశ్.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్‌మహాల్ వద్ద పర్యటకులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాడు. అనంతరం ధౌల్పుర్, మోరెనా వెళ్లనున్నట్లు తెలిపాడు.
ఇదీ చూడండి: