భారత్-చైనాల మధ్య చర్చలంటే ముందుగా గుర్తుకొచ్చేవి సరిహద్దు వివాదాలు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలకు కొదవలేదు. అయితే సరిహద్దు వివాదాలకు సంబంధించి గతంతో పోలిస్తే భారత్ వైఖరి కూడా మారింది. చైనా వ్యవహారశైలి గమనించే... వ్యూహాత్మకంగా అమెరికా, జపాన్‌లతో సన్నిహితంగా ఉంటూ డ్రాగన్‌కు పగ్గాలు వేస్తోంది. కొంతకాలంగా ఆ ప్రభావం ప్రత్యక్షంగా కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ -జిన్‌పింగ్ మధ్య జరిగే భేటి ప్రాధాన్యం సంతరించుకుంది.
హిందీ-చీనీ భాయి భాయీ.. జాన్తా నై
హిందీ-చీనీ భాయి భాయీ అన్న నినాదం ఇప్పుడు వినిపించడంలేదు. దక్షిణాసియాలో ఎప్పుడైతే భారత్ కీలకమైన శక్తిగా మారిందో అప్పటి నుంచి చైనా వైఖరి కూడా మారింది. సరిహద్దు వివాదాలకు సంబంధించి ఎప్పుడూ ఒంటెద్దు పోకడల్నే అనుసరిస్తూ రావడం.. పైపెచ్చు దబాయింపులకు దిగడం అలవాటుగా చేసుకుంది. అలాంటి సందర్భాల్లో భారత్ కూడా ఎక్కడా తగ్గటం లేదు. చైనా దూకుడుకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొన్ని సార్లు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
డ్రాగన్ వైఖరిలో మార్పు
ఇప్పుడిప్పుడే భారత్ పట్ల చైనా వైఖరిలో కూడా మార్పు కనిపిస్తోంది. జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం కొనసాగించాలని నిర్ణయించింది. కశ్మీర్ అంశం ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్-పాక్‌లను కోరింది. సరిహద్దు సమస్యలనేవి పొరుగు దేశాల మధ్య సహజమేనని చైనా పేర్కొనడం మారుతున్న దాని వైఖరికి నిదర్శనం.
వైరం వద్దు పొత్తు ముద్దు
ఆసియాలో రెండు బలమైన శక్తులుగా ఉన్న భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ప్రభావం పడకుంటే మంచిదని అంటున్నారు భారత్‌లో చైనా రాయబారి సున్ వీడాంగ్. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనడంలోనే రెండు దేశాల మధ్య సంబంధాల పురోగతికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదం సంక్లిష్టం, సున్నితమైనదని అన్నదే ఆయన అభిప్రాయం. ఈ సమస్య చాలా ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉండిపోవటానికి అదే కారణం.
సరిహద్దు వివాదాలు
కొన్ని దశాబ్దాల నుంచి సరిహద్దు వివాదం ఉన్నా ఇరు దేశాలు ఒక్క బుల్లెట్‌ను కూడా ఉపయోగించలేదనేది సున్ వీడాంగ్ చెబుతున్న మాట. అందుకే... భారత్- చైనాల మధ్య సరిహద్దు వివాదం రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఒక అంశం మాత్రమేనని అంటున్నారు వీడాంగ్. అయితే భారత్- చైనాల మధ్య దాదాపు 3,488 కిలోమీటర్ల పొడవున్న వాస్తవాధీనరేఖకు సంబంధించి వివాదం కొనసాగుతోంది. భారత్‌లో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్ అని చైనా వాదిస్తోంది.
అరుణాచల్‌ప్రదేశ్‌పై రగడ
ఈ ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడంపైనా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్- చైనా సరిహద్దు వివాదాలపై ఎన్ని సమావేశాలు జరిగినా.. ఇప్పటివరకూ ఈ సమస్య మాత్రం అపరిష్కృతంగానే ఉంది. సరిహద్దు వివాదం వల్ల రెండు దేశాలు 1962లో యుద్ధం కూడా చేశాయి. ఇప్పుడు కూడా సరిహద్దులోని కొన్నిప్రదేశాలు అప్పుడప్పుడు ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి. డోక్లాం, లద్దాఖ్ సరస్సు వద్ద ఘర్షణలే అందుకు ఉదాహరణ. సరిహద్దు వివాదానికి సంబంధించి 2దేశాల మధ్య దాదాపు 20 సార్లు ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి కూడా.
మహాబలిపురం భేటీపై సర్వత్రా ఆసక్తి
ఈ నేపథ్యంలోనే... మహాబలిపురం భేటీలో సరిహద్దు వివాదానికి ఇరుదేశాల అధినేతలు ప్రాధాన్యమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పష్టమైన ప్రతిపాదనలను చర్చకు పెట్టేందుకు దిల్లీ కూడా సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. నిజానికి జమ్మూకశ్మీర్‌లో అధికరణ 370 రద్దునేపథ్యంలో చైనాతో సమస్యల పరిష్కారం సంక్లిష్టంగా పరిణమించినట్టైంది అనేది కొంది అభిప్రాయం. 370 రద్దు తర్వాత పాక్‌ఆక్రమిత కశ్మీర్, చైనా ఆక్రమణలోని అక్సాయిచిన్‌ను స్వాధీనం చేసుకోడానికి భారత్ నిశ్చయంతో ఉందన్న కేంద్ర హోమంత్రి అమిత్‌షా ప్రకటనతో బీజింగ్ నాయకత్వం గుర్రుగా ఉంది.
ధాటిగా దీటుగా
కశ్మీర్ అంశంలో చైనా అనుసరిస్తున్న పాక్ అనుకూల వైఖరిపై అసంతృప్తితో ఉన్న కేంద్రం.. సరిహద్దు సమస్యల గురించి ఇరుదేశాల ప్రత్యేక రాయబారుల మధ్య సెప్టెంబర్ మొదట్లో జరగాల్సిన 22వ రౌండ్ సమావేశాలను వాయిదావేసింది. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన లదాఖ్‌లోని ప్యాంగాంగ్ త్సో సరస్సు ఉత్తరదిశలో భారత్, చైనా సైనిక దళాల మధ్య కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న ఘర్షణలతో 2దేశాల మధ్య పరిస్థితులు మళ్ళీ వేడెక్కాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో హిమ్ విజయ్ పేరిట భారత సైన్యం జరుపుతున్న సైనిక విన్యాసాలు బీజింగ్ కు కంటగింపుగా మారాయి. ఈ పరిస్థితుల్లో మహాబలిపురం భేటీలో ఎలాంటి ఫలితాలొస్తాయో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
పరిణితి చెందిన సంబంధాల కోసం స్పష్టమైన నిబద్ధతను వుహాన్ భేటి కల్పించిందని, దాని ప్రకా రమే చైనా, భారత్‌లు తమ సరిహద్దు సమస్యలు పరిష్కరించుకోవాలని నిపుణులు అంటున్నారు.
ఇదీ చూడండి: ఓల్గా, పీటర్‌ను వరించిన 'సాహిత్య నోబెల్'