లీటర్ వాటర్ బాటిల్‌ను ఇకపై రూ.13కన్నా ఎక్కువ ధరకు విక్రయించడానికి వీల్లేదని కేరళ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈమేరకు తాగునీటిని నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసి, తక్కువ ధరకే వాటర్ బాటిల్ విక్రయించేలా చర్యలు తీసుకోనుంది.
ప్రస్తుతం లీటర్ తాగునీటి సీసా ధర రూ.20. అయితే ఈ ధర ఎక్కువగా ఉందని ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం.
"రెండు రోజుల్లో బాటిల్ తాగునీరు ధర రూ.13గా నిర్ణయించినట్లు నోటిఫికేషన్ జారీ చేస్తాము. న్యాయనిపుణుల సలహా ఆధారంగానే నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి తాగునీటిని తీసుకొస్తున్నాం."
-పి.తిలోత్తమన్, ఆహార, పౌర సరఫరా మంత్రి.
ప్రస్తుతం కేరళలో 200కుపైగా ప్యాకేజ్డ్ తాగునీరు ఉత్పత్తిదారులు లైసెన్స్ లేకుండా కంపెనీలు నడుపుతున్నారని... వారిపై కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు తిలోత్తమన్.
నిరసనలు
రెండు సంవత్సరాలు క్రితమే కేరళ ప్రభుత్వం బాటిల్ తాగునీటి ధరను రూ.11-12 తగ్గించాలని భావించింది. అయితే... వాటర్ బాటిల్ ఉత్పత్తిదారుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రాగా వెనక్కి తగ్గింది. ఇప్పుడు ధరల నియంత్రణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: భారత్‌లో డొనాల్డ్ ట్రంప్ భారీ రోడ్ షో