భారత్‌తో సరిహద్దు ఘర్షణకు మరింత ఆజ్యం పోసేలా వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధవిమానాలు మోహరిస్తోంది చైనా. ఎల్ఏసీకి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటన్ ఎయిర్‌బేస్‌లో రెండు జే-20 యుద్ధవిమానాలను మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఉండే ఈ హోటన్ బేస్ వాస్తవాధీన రేఖకు అతి దగ్గర్లో ఉంటుంది. పీఎల్ఏ పశ్చిమ థియేటర్ కమాండ్ నేతృత్వంలో ఈ ఎయిర్‌బేస్ పనిచేస్తుంది. ఇప్పటికే ఇక్కడ జే-10, జే-11 ఫైటర్ విమానాలను సిద్ధంగా ఉంచింది చైనా. తాజాగా మోహరించిన యుద్ధ విమానాల్లో జే-8, జే-16లు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌తో ప్రత్యక్షంగా పోరాడాల్సి వస్తే వాయుసేనపై చైనా అధికంగా దృష్టిసారించదన్న అనుమానాల నేపథ్యంలో ఈ మోహరింపులు జరుగుతుండటం గమనార్హం.
దీటుగా భారత్
చైనాకు దీటుగా భారత్ సైతం సన్నద్ధమవుతోంది. సుఖోయ్-30, మిగ్ 29కే ఫైటర్, సీ17 ఎయిర్‌లిఫ్టర్, పీ8 నిఘా విమానం సహా చినూక్, అపాచీ హెలికాఫ్టర్లను సరిహద్దులో మోహరించింది. దీంతోపాటు వాస్తవాధీన రేఖకు వెంటనే తరలించే విధంగా లేహ్‌లో పలు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యూఏవీలు సిద్ధంగా ఉంచింది.
ప్రపంచంలో మూడోది
ప్రస్తుతం పీఎల్ఏఏఎఫ్ వద్ద 30 చెంగ్డూ జే-20 యుద్ధవిమానాలు ఉన్నట్లు సమాచారం. జే-20 యుద్ధవిమానం ప్రపంచంలోని మూడో స్టెల్త్ ఫైటర్ కావడం విశేషం. అమెరికా వద్ద ఉన్న ఎఫ్-22ఏ రాప్టార్, ఎఫ్-35 జాయింట్ స్ట్రైక్ ఫైటర్ విమానాలు ఈ కోవకు చెందినవే. ఇలాంటి అధునాతన యుద్ధవిమానాలు అమెరికా తర్వాత చైనా వద్ద మాత్రమే ఉన్నాయి.
ఈ ఐదో తరం జే-20 ఫైటర్ల ఉత్పత్తిని ఇటీవలే భారీ స్థాయిలో ప్రారంభించినట్లు తెలుస్తోంది. పీఎల్ఏఏఎఫ్కు వచ్చే 20 సంవత్సరాల వరకు ఈ విమానాలే కీలకంగా ఉండనున్నాయి. నిఘా వ్యవస్థను బోల్తా కొట్టించే(స్టెల్త్) అంశాలతో పాటు అధిక వేగం వంటి అధునాతన లక్షణాలు ఈ ఐదో తరం విమానాల్లో ఉంటాయి.
చైనాపై అమెరికా గురి
మరోవైపు, చైనా పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే హిందూ మహాసముద్రంలోని శాన్‌డియాగో ఎయిర్‌బేస్ వద్ద బీ2 స్టెల్త్ బాంబర్లను అమెరికా మోహరించింది. చైనాకు హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ మోహరింపులు చేపట్టింది. జపాన్‌లో ఎఫ్-35, ఎఫ్-22 విమానాలు, దక్షిణ కొరియాలో ఎఫ్-35లను మోహరించింది.
భారత్ సహా ఈ ప్రాంతంలో ఉన్న మిత్ర దేశాలకు మద్దతుగా బీ-2 బాంబర్లను మోహరించినట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖకు సమీపంలో ఫ్లైఓవర్ మిషన్లు, విన్యాసాల్లో వినియోగించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా చైనాను సంయుక్తంగా ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన చతుర్భుజి కూటమి ఏర్పాటుకు సైతం చర్చలు జరుగుతున్నాయి.
పాక్ సరిహద్దులోనూ
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో తేజస్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ సరిహద్దులో భారత వాయుసేన మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. దేశీయంగా తయారు చేసిన యుద్ధవిమానాన్ని సరిహద్దులో మోహరించడం విశేషం.
"ప్రత్యర్థి ద్వారా తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎల్సీఏ తేజస్‌ను పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గరలో భారత వాయుసేన మోహరించింది."
-ప్రభుత్వ వర్గాలు
ఇదీ చదవండి: ఫేస్బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!