కరోనా ఉందన్న అనుమానంతో పరీక్షలు చేసి, ఫలితాలు వచ్చేంత వరకు మృతదేహాలను రోజుల తరబడి ఆసుపత్రుల్లోనే ఉంచేస్తున్నారనే ఆందోళనల నడుమ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
"కరోనా అనుమానితుల మృతదేహాలను వెంటనే వారి బంధువులకు అప్పగించాలి. ల్యాబ్ల నిర్ధరణ నివేదికల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు"
-డాక్టర్ రాజీవ్ గార్గ్, డైరెక్టర్ ఆఫ్ జనరల్ హెల్త్ సర్వీసెస్, ఆరోగ్య శాఖ
అయితే, మృతదేహాలను తీసుకెళ్లాక.. ఆరోగ్య శాఖ వెబ్సైట్లో సూచించినట్లుగా.. పీపీఈలు ధరించి, ఇతర జాగ్రత్తలు పాటించి అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
ఒకవేళ నిర్ధరణ పరీక్షల్లో మరణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలితే.. ఆ వ్యక్తిని కలిసిన వారిని, అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని ట్రాకింగ్ పద్ధతిలో క్వారంటైన్ చేయనున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పురోగతి!