కశ్మీర్ దాల్ సరస్సులో బోటు అంబులెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వేలాది మంది ప్రయోజనం పొందనున్నారు.
సవాళ్లే అవకాశాలుగా...
కరోనా.. ఎందరో బతుకులను అతలాకుతం చేసింది. ఎన్నో ఇబ్బందులు పెట్టింది. వారిలో దాల్సరస్సుకు చెందిన ఓ హౌస్‌బోటు యజమాని తారీక్ అహ్మద్ పత్లూ కూడా ఉన్నారు. వైరస్ బారిన పడిన సమయంలో ఆసుపత్రి వెళ్లేందుకు ఇబ్బంది పడిన పత్లూ.. తనలా ఇంకెవరికీ జరగకూడదని అనుకున్నారు. అందుకు ఓ వినూత్న ఉపాయంతో బోటు అంబులెన్స్ సేవలను అక్కడి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఆధునిక వైద్య పరికరాలతో
35 అడుగులు పొడువైన అంబులెన్స్‌లో అత్యసవర సమయంలో కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్, ఈసీజీ, ఆక్సోమీటర్, వీల్‌ఛైర్, స్ట్రెచ్చర్ వంటి పరికరాలు అందుబాటులో ఉంచనున్నట్లు తారీక్ తెలిపారు. అంతేకాదు.. తనను సులభంగా సంప్రదించడానికి చేయడానికి టోల్‌ఫ్రీ నంబరు కూడా అంబులెన్స్‌పై లిఖిస్తానని చెప్పుకొచ్చారు.
"నాకు కరోనా సోకినప్పుడు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. స్నేహితులు నన్ను బోటులో ఆసుపత్రికి తరలించారు. అది చాలా బాధ కలిగించింది. అప్పుడే నిర్ణయించుకున్నా. హౌస్బోటుల్లో జీవిస్తూ.. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి అంబులెన్స్ సేవలు అందించాలని. వారి కోసం ప్రత్యేక బోటు అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాను."
- తారీక్ అహ్మద్ పత్లూ, హౌస్‌బోటు యజమాని
'దాల్ సరస్సు ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అత్యసవర సమయంలో వైద్య సేవలు అందక ఎంతో మంది చనిపోయారు. ఇక ముందు అలాంటి పరిస్థితి రాకూడదని బోటు అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాను. భవిష్యత్‌లో ఇది కీలక పాత్ర పోషించనుంది' అని చెప్పుకొచ్చారు తారీక్.
ఇదీ చూడండి: చారిత్రక కళ తప్పుతున్న 'కమ్లా కోట'